● ఒకే వాహనానికి పలు రకాల నంబర్ ప్లేట్లు
● రోడ్లపై దర్జాగా స్వైర విహారం
● పట్టించుకోని రవాణా అధికారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బుధవారం మధ్యాహ్నం.. స్థానిక శ్రీరామ్ నగర్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ తన కుమార్తెను తీసుకుని బయల్దేరాడు. మార్గం మధ్యలో ఆమెను ఆటోలోనే కూర్చోబెట్టి తినుబండారాల కొనుగోలుకు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లాడు. అదే సమయంలో ఏపీ 39 యూజెడ్ 3393 నంబరు కారు వేగంగా దూసుకువచ్చి, ఆ ఆటోను, ఆ తరువాత మరో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడి, అందులో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్తె తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ కారును స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, అందులోని వ్యక్తులు కిందకు అక్కడున్న వారిపై నోరేసుకుని పడిపోయారు. ‘మా కారు.. మా ఇష్టం.. మేము రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ట్యాక్స్‌లు కడుతున్నాం’ అంటూ దబాయించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా.. అప్పటి వరకూ కారుకు బిగించి ఉన్న సొంత వెహికల్ నంబర్ ప్లేట్ తీసేసి ట్రావెల్స్ వాహనాలకు ఇచ్చే పసుపు రంగు నంబర్ ప్లేటును దర్జాగా పెట్టేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తూ..
రాజమహేంద్రవరం నగరంలో రోడ్లపై నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తూంటాయి. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేకుండా అనేక వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. కొన్ని ప్రైవేటు, టూరిస్టు వాహనాలు, ట్రావెల్స్ కార్లు ఇంకా పాత నంబర్ ప్లేట్లతోనే కనిపిస్తున్నాయి. ఫిట్‌నెస్, కాలుస్య నియంత్రణ ధ్రువపత్రాలు లేకపోయినా రోడ్ల పైకి వస్తున్నాయి. అనుమతి గడువు ముగిసిన వాణిజ్య వాహనాలు సైతం తిరుగుతున్నాయి. వీటి వలన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ట్రాఫిక్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బ్రేకులు సరిగ్గా లేని వాహనాలు, ఫిట్‌నెస్ గడువు ముగిసిన బస్సులు, అక్రమంగా మార్పులు చేసిన కార్లు రోడ్లపై తిరగడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘన కళ్ల ముందే జరుగుతున్నా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజల వాహనాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారులు, ఇటువంటి వాహనాలపై మాత్రం మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల అమలు, వాహన తనిఖీలు, ఫిట్‌నెస్ పరిశీలన తదితర విధుల్లో వారు కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ వాహనాలపై చర్యలు
ఒకే వాహనానికి రెండు రకాల నంబర్ ప్లేట్లు ఉపయోగించడం చాలా పెద్ద నేరం. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే, నంబర్ ప్లేట్లపై ఎంవీఐలతో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటిని సీజ్ చేస్తాం.
– ఆర్.సురేష్, జిల్లా రవాణా శాఖ
అధికారి, రాజమహేంద్రవరం


