సీసీ కెమెరాలు పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలు పెంచుతాం

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌

అమలాపురం టౌన్‌: రేంజ్‌ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. నేర పరిశోధనల్లో సీసీ ఫుటేజీలు కీలకం అవుతున్న క్రమంలో ఈ వ్యవస్థను అన్ని దుకాణాలు, ముఖ్య కూడళ్లు, పోలీస్‌ స్టేషన్ల వద్ద పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ (ఏఆర్‌) జిల్లా కార్యాలయాన్ని ఐజీ గురువారం తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను పెంచుతామని చెప్పారు. నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఇటీవల ప్రజలకు పోలీస్‌ శాఖ విస్తృత అవగాహన కల్పిస్తున్న క్రమంలో రేంజ్‌ పరిధిలో డిజిటల్‌ అరెస్టులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టింగులపై స్పందించి ఎలాంటి ప్రతి పోస్ట్‌లూ పెట్టవద్దని తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్మార్ట్‌ ఫోన్లలో అనవసర యాప్‌లను, లింకులను తొందర పడి ఓపెన్‌ చేయవద్దని ఐజీ అశోక్‌ కుమార్‌ సూచించారు. విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్పీ సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement