అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

వైఎస్సార్‌ సీపీ నేతల బృందం డిమాండ్‌

భీమోలు పెద్ద చెరువు పరిశీలన

దేవరపల్లి: జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, గోపాలపురం నియోజకవర్గం పరిశీలకులు చందన నాగేశ్వర్‌లతో కూడిన నేతల బృందం బుధవారం గోపాలపురం మండలం భీమోలు పెద్ద చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకం పనులను పరిశీలించింది. మండుటెండ, వడగాడ్పులను లెక్క చేయకుండా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ తరహా దోపిడీని తక్షణం ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. స్పందించకపోతే కలెక్టరేట్‌ ముట్టడికి వైఎస్సార్‌ సీపీ సన్నద్ధమవుతుందన్నారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఎందురు నోరు విప్పడం లేదన్నారు.

అనుమతికి మించి తవ్వకాలు :

మాజీ హోం మంత్రి వనిత

మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవడానికి 2 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు తవ్వడానికి అనుమతి తీసుకుని, సుమారు 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వినట్టు తెలిపారు. దేవరపల్లి మండలంలో త్యాజంపూడి ఆవ చెరువు, నల్లజర్ల మండలంలో పోతవరం, సుభద్రపాలెం చెరువులు, ద్వారకాతిరుమల మండలంలో పంగిడిగూడెం, తిరుమలంపాలెంలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు ఏ ఒక్క చెరువును విడిచిపెట్టడం లేదన్నారు. అక్రమ తవ్వకాలతో పాటు నిర్లక్ష్యంగా టిప్పర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని చెప్పారు.

ప్రకృతి వనరుల దోపిడీ : జక్కంపూడి రాజా

రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వనరుల దోపిడీ ఘోరంగా జరుగుతోందన్నారు. యంత్రాలు, లారీలతో చెరువుల్లో మట్టిని దోచుకుంటున్నారని చెప్పారు. రైతుల పేరున కూటమి నాయకులు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని దోపిడీ చేస్తున్నారని అన్నారు. భీమోలు చెరువులో 10 యంత్రాలు, వందల కొద్దీ లారీలతో మట్టిని దోపిడీ చేసి రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రోజుకు 3 వేల లారీల మట్టి, 2 వేల లారీల ఇసుక, 4 వేల లారీల గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతోందని వివరించారు. చెరవుల్లో అక్రమ మట్టి తవ్వకాలను నియంత్రించాలని కొవ్వూరు ఆర్డీఓను చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్‌లో కోరారు. గోపాలపురం, నల్లజర్ల మండలాల అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి, వెల్లంకి సుబ్రహమణ్యం, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వల్లభనేని సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర సోషల్‌ మీడియా విభాగం కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొండాడ వెంకటన్నబాబు, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సాలి వేణు, జిల్లా అధికార ప్రతినిధి గడా జగదీష్‌, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి నరహరిశెట్టి రాజేంద్రబాబు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సత్తి సాయి ఈశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి జ్యోతిశ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గన్నమని జనార్ధనరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement