● కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ర్యాలీ
● మందుల ఆన్‌లైన్ అమ్మకాలు
నిలిపివేయాలని డిమాండ్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం చేసిన సమ్మె సక్సెస్ అయింది. బంద్ నేపథ్యంలో నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఆనం కళాకేంద్రం వద్ద నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా దేవీచౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవ హారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనన్‌లైనన్‌లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్‌తో పూర్తిగా 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరుకు మెడికల్ షాపులు హోల్ సేల్ అండ్ రిటైల్ బంద్ చేసినట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,250 మెడికల్ షాపులు ఉన్నాయని వారంతా బంద్ పాటించారన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నగరంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో నాలుగు దుకాణాలు తెరచి మందుల విక్రయం విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించామన్నారు. తమకు మద్ధతుగా నిలిచిన ఐఎంఏ, కార్పొరేట్ మెడికల్ షాపుల యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకట రాజు (రాజా), రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా బాల, అసోసియేషన్ ప్రతినిధులు పిండి గణపతి, కె.శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర పాల్గొన్నారు. ఏపీ హోమియోపతి డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో అన్ని హోమియోపతి మందుల షాపులు బంద్ నిర్వహించాయని నగర అధ్యక్షుడు ఎస్‌వీస్ నాయుడు తెలిపారు.


