26 వరకు వడగాడ్పులు | - | Sakshi
Sakshi News home page

26 వరకు వడగాడ్పులు

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కీర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలు తీసుకోవాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించుకోవాలని సూచించారు. తలపై గుడ్డ, టోపీ ధరించడం, తరచుగా నీరు తాగడం, నేరుగా ఎండలో ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

29 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

రాజమహేంద్రవరం సిటీ: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు బుధవారం తెలిపారు. సికింద్రాబాద్‌ నాహర్‌ లాగున్‌ మధ్య మే 29వ తేదీ నుంచి జూన్‌ 29వ తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నాయన్నారు. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌– నహర్‌ లాగున్‌(07046)రైళ్లు , ప్రతీ సోమవారం నహర్‌ లాగూన్‌(07047) రైళ్లు నడవనున్నాయన్నారు. ఈ రైళ్లు జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లో ఆగడున్నాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

కల్వర్టు నిర్మాణం..

ట్రాఫిక్‌ మళ్లింపు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌):రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. దీంతో ధవళేశ్వరం మీదుగా కాకినాడ, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం, రాజోలు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ఆటోలను, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కార్లను, ఇతర ఆటోలను గోదావరి గట్టు, ధవళేశ్వరం సాయిబాబాగుడి మీదుగా మళ్లిస్తున్నారు. ధవళేశ్వరం ,బొమ్మూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు బొగ్గులదిబ్బ, ఐదుబళ్ల మార్కెట్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ నేతృత్వంలో చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement