వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికే మళ్లీ మొదటి ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ఏదో ఒక అంశంలో మొదటి ర్యాంకు సాధిస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం, గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించింది. తాజాగా మూడు రోజుల క్రితం వెలువడిన మే నెల సర్వేలో మళ్లీ అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ పొందింది.
దర్శనం ఇతర అంశాల్లో..
ద్వారకాతిరుమల 73.4 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.1 శాతంతో రెండవ ర్యాంక్, విజయవాడ 71.4 శాతంతో మూడవ ర్యాంక్, కాణిపాకం 70.8 శాతంతో నాల్గవ ర్యాంక్, అన్నవరం 70.7 శాతంతో ఐదవ ర్యాంక్, సింహాచలం 70.4 శాతంతో ఆరవ ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 70.1 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.
సౌకర్యాల కల్పనలో..
ద్వారకాతిరుమల 73.25 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 72.73 శాతంతా రెండవ ర్యాంక్, విజయవాడ 71.42 శాతంతో మూడవ ర్యాంక్, కాణిపాకం 70.86 శాతంతో నాల్గవ ర్యాంక్, అన్నవరం 70.55 శాతంతో ఐదవ ర్యాంక్, శ్రీశైలం 69.85 శాతంతో ఆరవ ర్యాంక్, సింహాచలం 69.79 శాతంతో ఏడవ (ఆఖరి) ర్యాంక్ సాధించాయి.


