● చిత్రంలో పాత్రల పేర్లన్నీ
దర్శకుడు బుచ్చిబాబు గ్రామస్తులవే
● సొంతూరిపై మమకారం చిత్రం కథాంశం
● వైరల్ అవుతున్న ఉప్పాడ కొత్తపల్లి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్తపల్లిలో ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపం
ఉప్పాడ కొత్తపల్లిలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా సొంతిల్లు
పిఠాపురం: ఇప్పటి వరకు సముద్రకోత, ఉప్పు చేపలు, జాంధానీ చీరలతో దేశ వ్యాప్త గుర్తింపు పొందిన కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి త్వరలో విడుదల కానున్న పెద్ది సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనుంది. ఆ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సానా బుచ్చిబాబు తన జీవితంలో సహచరులతో అల్లుకున్న అనుబంధాలనే చిత్రంగా రూపొందించి వారి పేర్లనే పాత్రలకు పెట్టడంతో ఇప్పుడు ఆ గ్రామం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన కొత్తపల్లి విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపం
కొత్తపల్లిలో తొలి కల్యాణ మండపంగా పేరొందిన ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపానికి బుచ్చిబాబు తన పెద్ది సినిమాలో పెద్ద పీట వేశారు. కొత్తపల్లికి చెందిన అచ్చియ్యమ్మ తన భూమిని ప్రభుత్వం తీసుకోగా వచ్చిన సొమ్ముతో ఊరిలో తొలి కల్యాణ మండపాన్ని నిర్మించింది. ఆమె పేరునే చిత్ర కథానాయిక జాన్వీకపూర్ క్యారెక్టర్‌కు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
ఉబ్బితబ్బిబవుతున్న స్థానికులు
తమ గ్రామంలో పుట్టి తమతో పాటు తిరిగిన కుర్రాడు సినీ దర్శకుడిగా ఇది వరకే ఉప్పెన చిత్రంతో మంచి పేరు తెచ్చుకుని, తాజాగా పెద్ది చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదగడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేవు. అదీగాక రామ్ చరణ్‌తో చిత్రం తీసి స్టార్ డైరెక్టర్‌గా ఎదగడం వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి.


