లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

ఏలేశ్వరం: మండలంలోని జాతీయ రహదారిపై చిన్నింపేట జంక్షన్‌ వద్ద మంగళవారం రాత్రి లారీ ఢీకొని సింద్రీపు అప్పలరాజు (50) తీవ్ర గాయాల పాలై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రత్తిపాడుకు చెందిన అప్పలరాజు తన అత్తగారి ఊరు సిరిపురానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. చిన్నింపేట జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి తుని వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అప్పలరాజును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య బేబి, కుమారై, కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితమే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తల్లి ప్రియుడిని

హత్య చేసిన మైనర్‌

పోలీసుల అదుపులో నిందితులు

కాకినాడ క్రైం: తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మైనర్‌ తన స్నేహితుడితో కలిసి అంతమొందించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్రి చందు (39) కోటిపల్లిలో ఉంటున్నాడు. ఏడేళ్ల క్రితం కాకినాడ ప్రేజర్‌పేటలో ఉండేవాడు. ఆ సమయంలో సమీపంలో నివసించే ఓ మహిళతో ఏర్పడ్డ పరిచయం సహజీవనానికి దారి తీసింది. మహిళకు ఇద్దరు పిల్లలు కాగా చందుకు భార్య, పిల్లలు ఉండేవారు. వారిద్దరూ అందరినీ వదిలేసి కోటిపల్లి వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ 17ఏళ్ల కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై, గంజాయి సహా చిన్నపాటి నేరాలు చేస్తూ కాకినాడలోనే ఉంటున్నాడు. చందు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతానికి వెళ్లడం, ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం చందు తన స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం సమీపంలో గండిపోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి రాత్రి కాకినాడకు వచ్చాడు. మద్యం మత్తులో యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆ బాలుడు 24 ఏళ్ల స్నేహితుడు బర్ణి కల లక్ష్మణరావుతో కలిసి బండరాయితో చందు తలపై కొట్టేశారు. దీనిని చూసిన వాహన చోదకులు క్షతగాత్రుడిని జీజీహెచ్‌లో చేర్చారు. బుధవారం చందు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రూ.కోటి విలువైన దేవదాయ భూమి స్వాధీనం

రావులపాలెం: మండలంలోని వెదిరేశ్వరం వీరేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన రూ.కోటి విలువైన 37 సెంట్ల భూమిని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి అన్యాక్రాం తంలో ఉన్న ఈ భూమిని హైకోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement