● తోటపేట వెలి ఘటనపై అధికారుల ఆగ్రహం
● ఇరుపక్షాలతో శాంతి సమావేశం, కౌన్సెలింగ్
● 20 మందిపై బైండోవర్ నమోదు
● 23న స్నేహపూర్వక సమావేశం ఏర్పాటు
తాళ్లరేవు: పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో వెలి ఘటనపై బుధవారం ఇరుపక్షాలతో శాంతి సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ పితాని త్రినాథరావు అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఇరు వర్గాల్లోని ఊడా వెంకటరమణ, రేవు భద్రయ్య, పెయ్యల సత్యనారాయణ, ఉండ్రు సత్యనారాయణ, న్యాయవాదులు పెయ్యల రమేష్, దడాల సత్యనారాయణ తదితరుల నుంచి వివరాలు తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న సమస్యలను పెద్దవి చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో ఇద్దరి గొడవ రెండు వర్గాల ఘర్షణలకు దారితీసిందన్నారు. గతంలో ఒకసారి సయోధ్య కుదిర్చినా మారకపోవడంతో ఇరుపక్షాల్లోని 20 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఇకనైనా అందరూ కలసి గ్రామంలో ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇరుపక్షాల అంగీకారంతో ఈ నెల 23వ తేదీన రెండు వర్గాలకు చెందిన ప్రతినిధులతో స్నేహపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ సత్యనారాయణ, కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూరిబాబు, ఎండీయూడబ్ల్యూఏ అధ్యక్షుడు కన్నీడి వెంకటరమణ, దళిత నాయకులు పాల్గొన్నారు.


