ముగిసిన జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

విజేలకు ఎంపీ హరీష్‌ మాధుర్‌ బహుమతి ప్రదానం

అమలాపురం రూరల్‌: అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌, ఆసియా ఫెడరేషన్‌, కామన్‌ వెల్త్‌ ఫెడరేషన్‌ అనుబంధంతో 15వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించడం ద్వారా కోనసీమకు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ హరీష్‌ మాధుర్‌ అన్నారు. రాష్ట్ర పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కోనసీమ హెల్త్‌ అండ్‌ ఫిట్నెస్‌ క్లబ్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో నిర్వహించిన పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 990 మంది పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ముగింపు కార్యక్రమంలో ఎంపీ హరీష్‌, ఎస్పీ రాహుల్‌ మీనా పాల్గొని విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అసోసియేషన్‌ సభ్యులు కోనసీమకు రైల్వే సౌకర్యం కల్పించాలని ఎంపీ హరీష్‌ను కోరారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు తదితరులతో పాటు జిల్లా, రాష్ట్ర, పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు డీవీ రమణ, పప్పుల శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు

స్వర్ణ పతక విజేతలు వీరే : గుజరాత్‌కు చెందిన అస్మా జబువాలా 84 ప్లస్‌ కేజీల విభాగంలో టోటల్‌లో స్వర్ణ పతకం సాధించింది. సబ్‌ జూనియర్‌ 120 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన భాగ్య ధావన్‌ మొత్తం 590 కేజీలతో టోటల్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఒడిశాకు చెందిన ఆకాంక్ష పరిడా 84 ప్లస్‌ కేజీల విభాగంలో 500.5 కేజీల టోటల్‌తో స్వర్ణ పతకం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement