చేలకు పెట్టిన నిప్పే ఊపిరి తీసింది | - | Sakshi
Sakshi News home page

చేలకు పెట్టిన నిప్పే ఊపిరి తీసింది

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

రామచంద్రపురం రూరల్‌: మండలం వేగాయమ్మపేట శివారు కుందాలమ్మచెరువుకు చెందిన కౌలు రైతు గుబ్బల సూరిబాబు (36) పంట చేలకు పెట్టిన నిప్పుతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్‌, ఎంఏఓ టీవీఆర్‌ మణిదీప్‌, స్థానికులు తెలపిన వివరాలా ఉన్నాయి. గ్రామంలో సూరిబాబు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పండిస్తున్నాడు. బుధవారం కోతలు ముగిసాక మిగిలిన వరిగడ్డిని తగులబెట్టి వెళ్లిపోయాడు. అప్పుడే మధ్యాహ్న భోజనం ముగించి కూర్చున్న అతడికి తన పొలంలో నిల్వ చేసిన గడిమేటుకు మంటలు అంటుకున్నాయని తెలిసి పరుగున వెళ్లాడు. అప్పటికే భుక్తాయాసంతో ఉన్న అతడు అక్కడ దట్టంగా అలముకున్న పొగకు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూరిబాబుకు భార్య, ఏడాది, మూడేళ్లు, ఆరేళ్ల ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. తాము దిక్కులేని వాళ్లం అయ్యామంటూ వారు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఎంత అవగాహన కల్పిస్తున్నా రైతులు వరి పొలాల్లో నిప్పు పెట్టడం మానడం లేదని ఏఓ మణిదీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కౌలు రైతు ప్రాణం తీసిన పొగ

దిక్కులేని వారైన భార్య,

ముగ్గురు చిన్నారులు

Advertisement
 
Advertisement
Advertisement