ఇలా రాజకీయ పయానాం | - | Sakshi
Sakshi News home page

ఇలా రాజకీయ పయానాం

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

తెలుగు గడ్డపై తమిళ ఎన్నికల పోరు

సిటింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌, మల్లాడి మధ్యే పోటీ

జోరుగా ఎన్నికల ప్రచారం, బరిలో 13 మంది

ఈ నెల 9న పోలింగ్‌, మే 4న కౌంటింగ్‌

యానాం: తెలుగు ప్రాంతమే కాని.. అక్కడంతా తమిళ పార్టీల చర్చే నడుస్తుంటుంది.. ఒకరు డీఎంకే అంటే, మరొకరు ఏఐఏడీఎంకే, నమదు రాజ్యం కాంగ్రెస్‌ అంటారు. అంతేకాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు, పుదుచ్చేరిలో జరిగే రాజకీయ పరిణామాలు, తమిళ ప్రాంతీయ పార్టీల చర్చ జరగడమే కాకుండా, ఆ పార్టీ నుంచి సైతం అభ్యర్థులు బరిలోకి దిగుతుంటారు. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం యానాం రీజియన్‌. 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 తమిళనాడు రాష్ట్ర సరిహద్దున ఉన్న పుదుచ్చేరిలోనే ఉండటంతో తమిళ పార్టీల ప్రభావం అక్కడ అధికంగా ఉంటుంది. మిగిలిన ఒక నియోజకవర్గం యానాం తెలుగు ప్రాంతమైనా జాతీయ పార్టీలతో పాటు మెజారిటీ తమిళ పార్టీలను ఇక్కడి నాయకులు తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది.

మల్లాడి రాజకీయ ప్రవేశం

1996లో మల్లాడి కృష్ణారావు (స్వతంత్ర) అభ్యర్థిగా మొదటిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా ఘన విజయం సాధించారు. 2000 సంవత్సరంలో మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పుదుచ్చేరి ముఖ్యమంత్రి షణ్ముగం (కాంగ్రెస్‌)ను యానాం నియోజకవర్గం నుంచి గెలిపించారు. 2001లో మల్లాడి కృష్ణారావు(ఇండిపెండెంట్‌), 2006, 2011, 2016 ఎన్నికల్లో సైతం మల్లాడి కృష్ణారావు (కాంగ్రెస్‌) గెలుపొందారు.

అందరి దృష్టినీ ఆకర్షించి..

2021లో యానాం నుంచి పోటీ చేసిన సీఎం అభ్యర్థి రంగసామి (నమదురాజ్యం కాంగ్రెస్‌)పై, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ విజయం సాధించడం పుదుచ్చేరి వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ముఖ్యమంత్రిపై 28 ఏళ్ల యువకుడు అశోక్‌ విజయం సాధించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం

2021 ఎన్నికల్లో సీఎం రంగసామిపై గెలిచి రాజకీయ ఓనమాలు తెలియని 28 ఏళ్ల యువకుడిగా పుదుచ్చేరి అసెంబ్లీలో అడుగుపెట్టిన గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ గత ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే ల్యాడ్‌, ఎంపీ ల్యాడ్‌, సీఎస్‌ఆర్‌ నిధులు సుమారు రూ.33 కోట్ల నిధులను సాధించారు. మత్స్యకారుల ఓఎన్జీసీ పరిహారం రూ.137 కోట్ల మేర వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేయించడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రంగంలోకి దిగారు. 1996 తర్వాత యానాం నియోజకవర్గంలో జరిగిన పలు నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పన, జిప్‌మెర్‌ వంటి ఆసుపత్రి నిర్మాణం, పర్యాటక ప్రాజెక్టులు ఆయన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 33 ఏళ్ల అశోక్‌, 62 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుని మధ్య పోరు జరుగనుండటంతో అందరినీ ఈ ఎన్నిక ఆకర్షిస్తుంది. యానాం నియోజకవర్గ శాసనసభా స్థానానికి ఈ నెల 9న పోలింగ్‌ జరగనుండగా, మే 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉండగా, జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

సామాజికవర్గాల ప్రభావం

యానాంలో కాపులు, మత్స్యకారులు, ఎస్సీలు అతి పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. దీంతో ఆయా వర్గాలు ఎటు మొగ్గుచూపుతారో వారికే విజయావకాశాలు ఉండనున్నాయి. ఇటీవల ఓటరు జాబితా రివిజిన్‌ తర్వాత ఎక్కువ ఓటు బ్యాంకు ఉండే మత్స్యకారుల ఓట్లు తగ్గడంతో కాపుల ఓట్లు ఎక్కువయ్యాయి. అదే విధంగా ఎస్సీల ఓట్లు సైతం గెలుపోటములను నిర్ధేశించనున్నాయి.

తొలిసారిగా ఎన్నికలు ఎప్పుడంటే..

1955లో యానాం రెండు నియోజకవర్గాలుగా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, యర్రా జగన్నాథరావులు చెరో నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1959లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, కామిశెట్టి సావిత్రీ 1964లో గెలుపొందారు. ఫ్రెంచి వారు యానాంను భారతదేశంలో విలీనం చేయడంతో యానాం ఒక నియోజకవర్గంగా మారింది. 1969లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు(స్వతంత్ర అభ్యర్థి), 1974లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, 1977లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు (జనతా), 1980లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు, 1985లో కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు (కాంగ్రెస్‌), 1990లో రక్షాహరికృష్ణ (డీఎంకే), 1991లో వెలగా రాజేశ్వరరావు(కాంగ్రెస్‌) ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement