రాయవరం: ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1– 5 తరగతులకు సోమవారం నుంచి 10వ తేదీ వరకూ, 6 – 8 తరగతులకు సోమవారం నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే 1 – 5 తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6 – 8 తరగతులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ గత నెల 16వ తేదీ నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 5.20 లక్షల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు.
సీబీఏ విధానంలో..
క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్ (సీబీఏ) విధానంలో సమ్మేటివ్–2 పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో కొన్ని పరీక్షలకు అమలు చేయగా, ప్రస్తుతం అన్ని తరగతులకు అన్ని పరీక్షలను సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న సమ్మేటివ్–2 పరీక్షలను ఓఎంఆర్ విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది.
టైం టేబుల్ విడుదల
పరీక్షల నిర్వహణకు ఎస్‌సీఈఆర్‌టీ టైమ్ టేబుల్ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందు పరచాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు. 1 – 5 తరగతులకు 6న తెలుగు, 7న ఇంగ్లిషు, 8న గణితం, 9న ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, 10న ఓఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తారు. 6 – 8 తరగతులకు 6న తెలుగు, 7న హిందీ, 8న ఇంగ్లిషు, 9న గణితం, 10న పీఎస్, 11న బయాలజీ, 13న సోషల్ స్టడీస్, 15న కాంపోజిట్ తెలుగు, 16న ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రశ్నపత్రాల పంపిణీకి చర్యలు
మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను చేర్చే పనిలో జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు (డీసీఈబీ) నిమగ్నమైంది. ఇప్పటికే మండల విద్యాశాఖ కార్యాలయాలకు ప్రశ్నాపత్రాలను పంపించారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ప్రశ్నపత్రాలను సరిచూసుకుని ఎమ్మార్సీలో భద్రపర్చుకున్నారు. పరీక్షల ప్రారంభం నుంచి సంబంధిత ప్రశ్నపత్రా ల బండిళ్లను ఏరోజు కారోజు పరీక్షకు గంట ముందు ఎమ్మార్సీల నుంచి హెచ్‌ఎంలు వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఫ రేపటి నుంచి 1–8 తరగతులకు
ఎస్‌ఏ – 2 పరీక్షలు
ఫ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
పది పరీక్షల మాదిరిగానే..
10వ తరగతి పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఈ వార్షిక పరీక్షలను నిర్వహించాలి. ఎటువంటి అపోహలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో పరీక్షలను నిర్వహించాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపై ఉంది. ఎటువంటి అవకతవకలు, లోపాలు చోటుచేసుకున్నా సంబంధిత హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ


