ప్రాణాలతో జలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో జలగాటం

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

సరదాగా ఈతకెళ్లిన నలుగురు స్నేహితులు

ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు

ఆత్రేయపురం మండలం

పిచ్చుకలంక వద్ద ఘటన

మృతులంతా రాజమహేంద్రవరం వాసులు

సాక్షి, అమలాపురం/ ఆత్రేయపురం: ఉరకలేసే గోదావరి అప్పుడప్పుడూ యువత ఉసురు తీస్తోంది. జల క్రీడ వారిని మృత్యుఒడిలోకి లాగేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక శివారు గోదావరిలో శనివారం మధ్యాహ్నం ఒకరు మృతి చెందడం, ఇద్దరు యువకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద స్నానాలకు దిగగా ఈ ఘటన జరిగింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామ శివారు పిచ్చుకలంకలో గోదావరి నదిలోకి రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు స్నేహితులు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్నానాలకు దిగారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గోరక్షణపేట, తుమ్మలావ ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ అర్ఫాద్‌, షేక్‌ బిలాల్‌ (29), షేక్‌ సుల్తాన్‌ మహ్మద్‌ గల్లంతయ్యారు. ఇందులో షేక్‌ బిలాల్‌ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. నలుగురు స్నేహితుల్లో ముసలి మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈత కోసం వెళ్లి..

ధవళేశ్వరం – బొబ్బర్లంక మధ్య ఉండే పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో ఈత కొట్టేందుకు వారంతా దిగారు. బ్యారేజీ గేట్ల దిగువన ఉన్న ఆనకట్టును దాటుకుని ఇసుక తిన్నెలు మొదలయ్యే ప్రాంతంలో వరకూ వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ నది లోతు పది నుంచి ఇరవై అడుగులు (మడుగులా) ఉంటోంది. నీటి ప్రవాహం కూడా అధికం. ఇది తెలియని యువకులు ఈత కొడుతూ కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం ఆత్రేయపురం ఎస్సై ఎస్‌.రాము ఆధ్వర్యంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. స్నానానికి వెళ్లిన యువకుడు ముసలి మణికంఠ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.

ఏటా విషాద ఘటనలే..

ఏటా వేసవి వచ్చిందంటే గోదావరి చెంతన విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వైనతేయ, వశిష్ఠ, గౌతమీ నదీపాయల వెంబడి పలుచోట్ల లంకలు, గోదావరి ఏటిగట్టు దిగువన స్నానాలకు దిగడం పరిపాటి. ఇటువంటి చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మే 27న ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో స్నానాలకు వెళ్లి ఎనిమిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకకు వచ్చిన 20 ఏళ్ల వయస్సు లేనివారు గోదావరిలో మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనితో పాటు పి.గన్నవరం అక్విడెక్టు, ముంగండ, రాజోలు, మలికిపురం, ఊడిమూడిలంక, గంటి పెదపూడి, కోటిపల్లి, శేరులంక, మురమళ్ల వంటి ప్రాంతాల్లో గోదావరి స్నానాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు, మూడు రోజులు హడావుడి చేసే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌ అధికారులు తరువాత గాలికి వదిలేస్తున్నారు.

పిచ్చుకలంక వద్ద గోదావరిలో గాలింపు చర్యలను పరిశీలిస్తున్న పోలీసులు

ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు

పర్యాటకుల తాకిడి అధికం

ధవళేశ్వరం బ్యారేజ్‌ నాలుగు ఆర్ముల్లో వేసవి సమయంలో పెద్ద ఎత్తున స్నానాలకు వస్తుంటారు. అధికంగా ధవళేశ్వరం, బొబ్బర్లంక ఆర్ముల వద్ద పర్యాటకుల తాకిడి ఉంటుంది. కొత్త, పాత బ్యారేజ్‌ మధ్య ఉండే ప్రాంతం స్నానాలకు అనువుగా ఉంటోంది. ఇది మండుటెండల నుంచి ఉపశమనం కలిగించేది కావడంతో కోనసీమ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. యువకులు, పెద్దలతో పాటు మహిళలు వస్తుంటారు. అయితే ఇక్కడ కనీస రక్షణ చర్యలు లేవు. హెచ్చరిక బోర్డులకే పరిమితం కావడంతో ఏటా ప్రమాదాలు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement