రాజమహేంద్రవరం రూరల్: ఓ వ్యక్తిని మాయమాటలతో నమ్మించి, అతడిపై దాడి చేసి, బంగారం దోచుకున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ ఆ వివరాలు వెల్లడించారు. హుకుంపేట గ్రామానికి చెందిన బంటు బాబూరావు గత నెల 18న హుకుంపేట సెంటర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి సుమారు 30 ఏళ్ల పురుషుడు, మహిళ బండిపై వచ్చారు. మీ ఇల్లు అమ్మడానికి బేరం పెట్టారు కదా, దాన్ని కొనుక్కునే వ్యక్తి ఆవ రోడ్డులో ఉన్నాడని నమ్మించి, అక్కడున్న ఓ కొబ్బరితోటలోకి తీసుకువెళ్లారు. వెంటనే బాబూరావు ముఖంపై కొట్టి, మెడలోని సుమారు మూడు కాసుల బంగారం చైన్, రెండు కాసుల విలువైన రెండు ఉంగరాలను లాక్కుని పారిపోయారు. దీనిపై బాబూరావు గత నెల 19వ తేదీన బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. సౌత్‌జోన్ డీఎస్పీ భవ్యకిశోర్ పర్యవేక్షణలో, క్రైం డీఎస్పీ సుభాష్ సూచనల మేరకు ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం బొమ్మూరు విద్యుత్ కార్యాలయం వద్ద గణపవరం మండలం పిప్పరకు చెందిన గరగ శివకృష్ణ, జవ్వాది శ్రీను, మావెల్ల సాయి లోకేష్, నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన జాలపర్తి మేరీలను అరెస్టు చేశారు. వారి నుంచి 36.59 గ్రాముల బంగారం వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కొత్తపేట, రామచంద్రపురం, పామర్రు, అయినవిల్లి, అనపర్తి, రాజమహేంద్రవరం త్రీటౌన్ పరిధిలో మరో ఏడు దోపిడీలను పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. దొంగిలించిన బంగారం ఆభరణాలను తాడేపల్లిగూడేనికి చెందిన గురజాడ ఆనంద్‌కుమార్‌కు అమ్ముతున్నట్టు గుర్తించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఫ 36.59 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్


