దళితులపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

దళితులపై కూటమి కక్ష

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు అన్నారు. ఆయన శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి వ్యవహరశైలితో దళితుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇటీవల నర్సీపట్నం నూకాంబిక జాతరలో నాగులాపల్లి రాందాస్‌ అనే డప్పు కళాకారుడిని కులం పేరుతో తిట్టి, చెయ్యి ఎత్తి కొట్టి, బెదిరించడం దారుణమన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ వంటి రాజ్యాంగ పరమైన పదవిలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు ఇటీవల ఆకివీడు దళిత పేటలో శ్రీరామనవమి పేరుతో 300 మంది కిరాయి రౌడీలను వెంట తీసుకు వెళ్లి, పక్కా ప్రణాళికలతో దాడులు చేయించి, అమాయక దళిత యువకులై అక్రమంగా హత్యాయత్నం కేసులను బనాయించి జైలుకు పంపించాడన్నారు.

22, 23 తేదీల్లో రాష్ట్రస్థాయి

బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌

దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు ప్రధానోపాధ్యాయుడు, శాప్‌ డైరెక్టర్‌ పేరం రవీందనాథ్‌ శనివారం తెలిపారు. కేర్‌ ఫౌండేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక సీఈఓ రాపాక సహకారం, జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామన్నారు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, గొల్లల మామిడాడ, కాకినాడ, మార్టేరు, వైజాగ్‌, విజయవాడ, చిత్తూరు జిల్లాల నుంచి పురుషుల జట్లు, అలాగే రామన్నపాలెం, రామచంద్రపురం, ఏలూరు, నర్సరావుపేట, వైజాగ్‌, నూజివీడు నుంచి మహిళల జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయన్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయం కల్పించినట్టు చెప్పారు.

కల్తీపాల నియంత్రణకు చర్యలు

రాజమహేంద్రవరం రూరల్‌: కల్తీపాల నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా పశుసంవర్థక అధికారి టి.శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి కె.సుప్రియ తెలిపారు. ఈ మేరకు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 705 పాల నమూనాలను పరీక్షించగా, వాటిలో 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించామన్నారు. సంబంధిత వ్యక్తులపై ఆహార భద్రతా చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి జిల్లాలో ర్యాండమ్‌గా రాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తూ కల్తీ పాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్‌, ఇంటింటికి విక్రయాలు చేసే వారందరూ తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలని స్పష్టం చేశారు. ఇందుకోసం స్థానిక పశుసంవర్థకశాఖ, సచివాలయ సిబ్బందిని సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement