కుర్రకారు కేరింతలతో చేబ్రోలులో దుమ్ము రేపిన గుర్రాలు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు రేసు గుర్రాల గిట్టల శబ్దాలతో మార్మోగింది. ఉత్కంఠ నడుమ కనురెప్ప పాటులో గమ్యం చేరుకోవడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే జనం కేరింతలకు అంతు లేకుండా పోయింది. పదేళ్ల క్రితం సామర్లకోటలో జరిగిన గుర్రాల పందేల తరువాత గత ఏడాది నుంచి మళ్లీ పందేలు ప్రారంభం కావడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 25 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురానికి చెందిన విక్కీ (గుర్రం) ఈ పోటీలో ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అదే జిల్లా రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండో స్థానాన్ని, మూడు, నాలుగు స్థానాలను విజయనగరం జిల్లా సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం కై వసం చేసుకుంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లికి చెందిన గుర్రం (ధర్మ), అంకంపాలేనికి చెందిన గుర్రం (మురుగన్) , అనకాపల్లి జిల్లా మల్లంపాలేనికి చెందిన గుర్రాలు వరుసగా 5, 6, 7, స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఓదూరి కిశోర్, ఓదూరి నాగేశ్వరరావు, ఓరుగంటి పెదకాపు, చల్లా చినబాబు, దుళ్ల సీతారామయ్య, గెడ్డం బుజ్జి, బుర్రా అనుబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు.


