పెద్దపులి.. పెదకొండేపూడి వైపు..! | - | Sakshi
Sakshi News home page

పెద్దపులి.. పెదకొండేపూడి వైపు..!

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

రామదుర్గం దాటుకుని

మైదాన ప్రాంతానికి పయనం

విశాఖ జూ అధికారులు వదలిన చోటుకే మళ్లీ చేరే అవకాశం

దేవీపట్నం: అటవీ అధికారులకు అగ్నిపరీక్షగా మారిన పెద్దపులి పయనం రామదుర్గం కొండను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడి వైపు మళ్లింది. గడిచిన ఆరు రోజులుగా దేవీపట్నం మండలంలో సంచరిస్తూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు చేరింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద కొండకు చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున రామదుర్గం కొండపై ఉన్నట్లు జీపీఎస్‌ సిగ్నల్స్‌ అందడంతో నేలకోట రామదుర్గం కొండకు వెళ్లే మార్గంలో ఇందుకూరు అటవీ రేంజ్‌ అధికారి కొండలరావు ఆధ్వర్యంలో రెస్క్యూటీం, వాహనంతో పులిగమనాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొండపై కోతులు, పక్షులు పులిని చూసి భయాందోళనతో అరవడంతో ఈ సంకేతాలను గమనించిన సమీపంలో ఉన్న అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సమయంలో రామదుర్గం కొండకు వెళ్లే మార్గాన్ని దాటుకుని ఎదురుగా ఉన్న మరో కొండపైకి చేరింది. ఈ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించి అటవీ అఽధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కొండకు చేరినప్పటి నుంచి జీపీఎస్‌ సిగ్నల్స్‌ పరిశీలించగా సాయంత్రం చీకటి పడే వరకూ పులి నడుస్తూ సంచరిస్తున్నట్లే సిగ్నల్స్‌ అందడంతో ఏజెన్సీ ప్రాంతాన్ని దాటుకుని సీతానగరం మండలం పెదకొండేపూడి వైపు పులి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బుధవారం రాత్రికి పురుషోత్తపట్నం వైపు మళ్లితే గోదావరి నదిని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా సీతానగరం వైపు మరలితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ జూ నుంచి అధికారులు వదలిన దగ్గర నుంచి పులి రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల గూండా సంచరించి తిరిగి యూ టర్న్‌ తీసుకుంది. అప్పటి నుండి ఇంచుమించు వెళ్లిన మార్గంలోనే గోకవరం, రంపచోడవరం ఆర్‌అండ్‌బి రహదారిని దాటుకుని దేవీపట్నం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పులి మొట్టమొదట ప్రారంభమైన చోటుకే ఇంచుమించు చేరుకుంది. ఇదిలా ఉండగా పౌర్ణమి రోజున రామదుర్గం కొండపైకి భక్తులు రావడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రాజానగరం మండలంలో పలు గ్రామాల నుంచి బుధవారం ఉదయం భక్తులు రామదుర్గం కొండపైకి చేరుకున్నారు. ఈ సమయంలో పులి కొండపైనే ఉండడంతో అటవీ అధికారులు అప్రమత్తమై కొండపై నుంచి భక్తులు భయటకు రాకుండా గేట్లు వేసుకుని ఉండాలని సూచించారు. దిగువ నుంచి కొండపైకి భక్తులు రాకుండా నిలిపి వేసారు. పౌర్ణమి రోజు కొండపై ప్రత్యేక పూజలు చేసేందుకు సాయంత్రం సమయంలో పలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అధికారులు వెనక్కి పంపేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రాకుండా పహారా ఏర్పాటు చేశారు. పులి రామరుర్గం కొండను వీడి మైదాన ప్రాంతానికి మరలిందని నిర్ధారించిన అనంతరం కొండపై ఉన్న భక్తులను అటవీ సిబ్బంది సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement