అక్రమ నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పండగ | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పండగ

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

గౌతమి బిల్డింగ్‌ విషయంలో

హైకోర్టు ఆదేశాలు పాటించాలి

పీజీఆర్‌ఎస్‌లో మాజీ ఎంపీ

భరత్‌రామ్‌ వినతిపత్రం

రాజమహేంద్రవరం సిటీ: నగరంలో అక్రమ భవన నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పండగ చేసుకుంటున్నారని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరం దేవీచౌక్‌ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదుట గౌతమి బిల్డింగ్‌ జి ప్లస్‌ ఫోర్‌లో నిబంధనలను అతిక్రమించి నిర్మించారని అన్నారు. ఈ బిల్డింగ్‌ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని మహమ్మద్‌ ఉస్మాన్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులు విచారణ జరిపి నిర్మాణం అక్రమమని నిర్ధారణ చేస్తే చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ఆదేశించినట్టు భరత్‌రామ్‌ తెలిపారు. ఆ ఆదేశాలను అమలు పరచాలని ఆయన సోమవారం కార్పొరేషన్‌ సిటీ ప్లానర్‌ జీవీవీఎస్‌ మూర్తిని కోరారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 22 శాతం పార్కింగ్‌ ఉండాలని సెట్‌ బ్యాక్‌లు ఉండాలని, ఓపెన్‌ స్థలం ఉండాలని అయితే ఇవన్నీ ఎక్కడ కనిపించవన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడికి లొంగి బిల్డింగ్‌ యజమానిపై చర్యలు మానేసి బీపీఎస్‌ అమల్లో ఉందని వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ బిల్డింగ్‌ వ్యవహారం తాము హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు.

రూ.లక్షల్లో ముడుపులు

నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే సిటీ ఎమ్మెల్యేకు పండగేనని, వెంటనే ఆయన అనుచరులు రాబందుల్లాగా వాలిపోయి రూ.లక్షల్లో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం సైజును బట్టి రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ముడుపుల మత్తులో పడి ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. నగరంలో వందలాది అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటి వైపు కనీసం కన్నెత్తి చూసిన ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ లేరన్నారు.

ఎమ్మెల్యేకు సవాల్‌

ఎన్నికల ముందు ఇదే బిల్డింగ్‌ వ్యవహారంలో తాను రూ.ఐదు కోట్లు లంచం తీసుకున్నానని నగరమంతా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసి, విష ప్రచారం చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్యాయంగా ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఎన్నికల ముందు తనపై చేసిన లంచం ఆరోపణలు ఈవీఎం ఎమ్మెల్యే నిరూపించాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నిరూపించినట్లైతే అదే బిల్డింగ్‌ వద్ద తాను క్షమాపణ చెప్తానని భరత్‌రామ్‌ సవాల్‌ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌కు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు అతిక్రమించిన అక్రమ బిల్డింగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితుల్ని కించపర్చిన వ్యవహారంలో పోలీస్‌ కేసు నమోదు చేసినా బాధితులకు ప్రాథమిక హక్కుగా ఇవ్వవలసిన రసీదును ఒక సీఐ నిరాకరించడాన్ని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. క్రెడిట్‌ చోరీ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినవారు లేరని, రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చిన పోర్టులు, పరిశ్రమలు గత జగనన్న ప్రభుత్వంలో వచ్చినవేనన్నారు. ఈయన వెంట వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ దాసి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ మున్సిప్‌ల్‌ వింగ్‌ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement