సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Mar 30 2026 8:35 AM | Updated on Mar 30 2026 8:35 AM

1న కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష

యూటీఎఫ్‌ నాయకుల పిలుపు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): 12వ పీఆర్సీని అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏప్రిల్‌ ఒకటో తేదీన కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్‌ నాయకులు ఈవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఎ.షరీఫ్‌ తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు, హెల్త్‌ కార్డుల మంజూరు తదితర సమస్యలపై వారు డిమాండ్‌ చేశారు. వీటి సాధనకు చేపడుతున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

కార్టూనిస్ట్‌ శేఖర్‌కు

ఉత్తమ పురస్కారం

రాజమహేంద్రవరం సిటీ: నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ వి.శేఖర్‌ను హైదరాబాద్‌కు చెందిన తపస్వీ మనోహరం సాహిత్య సేవా సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారంతో సత్కరించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళాభవన్‌లో ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా శేఖర్‌కు పురస్కారంతో పాటు, నగదు, ప్రశంసాపత్రం జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తిక్‌, ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పి.చంద్రశేఖర్‌ అజాద్‌, సాధనాల వెంకటస్వామి నాయుడు విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకులు చంద్ర ప్రతాప్‌ కంతటి తదితరులు పాల్గొన్నారు.

‘చిరు సంచుల’తో

అధిక దిగుబడి

హెక్టారుకు 7 టన్నుల ధాన్యం దిగుబడి

నూతన వరి వంగడం ఎంటీయూ 1426

దేవరపల్లి: మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన నూతన వరి వంగడం చిరుసంచులు రకం ఎంటీయూ 1426 అధిక దిగుబడులు ఇస్తోందని మండల వ్యవసాయాధికారి కె.కమల్‌ రాజ్‌ తెలిపారు. ఈ వంగడాన్ని ద్వాళ్వాలో రైతుల కమతాలలో ప్రయోగం నిమిత్తం ఈ ఏడాది పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ రకం దళ్వాలో 120 నుంచి 125 రోజుల్లో పక్వానికి వస్తుందని, హెక్టారుకు 6.5 నుంచి 7 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అగ్గితెగులు, ఎండాకు తెగులు, దోమపోటు, ఉల్లికోడును తట్టుకుంటుందని ఆయన తెలిపారు. గత రబీలో మిగిలిన రబీ రకాలతో పోలిస్తే 8 నుంచి 10 శాతం దిగుబడిలో వృద్ధిని గమనించామని, తినడానికి బాగుందని ఆయన తెలిపారు. రైతులు పండించిన విత్తనాలను తోటి రైతులకు పంపిణీ చేయవచ్చునని ఆయన తెలిపారు.

ఘనంగా వేద సదస్యం

అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్‌, రామాలయ అర్చకుడు కోట వంశీ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement