ఆరుగురికి గాయాలు
ఏలేశ్వరం: మండల పరిఽధిలోని యర్రవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పగా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం యర్రవరం వద్ద జాతీయ రహదారిపై పేరవరం జంక్షన్‌లో రహదారిపై ప్రయాణికులను దింపేందుకు ఆటో సడన్‌గా ఆపగా.. వెనుక రాజమహేంద్రవరం నుంచి తుని వైపు వస్తున్న ట్రాలీ డ్రైవర్ స్లో చేశాడు. దాని వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాలీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇర్రిపాకకు చెందిన పళ్లరాణి, కిర్లంపూడికి చెందిన సరకనం పార్వతి, కోటనందూరుకు చెందిన గార్ల మానస, బి.సోమరాజు డి పోలవరానికి చెందిన ఎం.తాతారావు, ఎం చంద్రమ్మ ఉన్నారు. ఘటనా స్థలాన్ని ీసీఐ సూర్యఅప్పారావు, ఎస్సై రామలింగేశ్వరరావు పరిశీలించి క్షతగాత్రులను 108లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గల్లంతైన
వ్యక్తి కోసం గాలింపు
గంగవరం: సూరంపాలెం రిజర్వాయర్‌లో బోటు మునిగి గల్లంతైయినట్టు భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి కోసం రెవెన్యూ, పోలీసు సిబ్బంది విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై వెంకయ్య, ఆర్‌ఐ లక్ష్మణ రావు, సర్పంచ్ బల్లెం శివదొర సూరంపాలెం రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక ఈతగాళ్లతో గాలింపు చర్యలను చేపట్టినా ఫలితం ఆచూకీ దొరకలేదు. ప్రాజెక్ట్ లోతు ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టమైందని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. దీంతో కాకినాడ నుంచి బృందం బయలుదేరిందని, రాగానే శుక్రవారం ఉదయం రిజర్వాయర్‌లో గాలింపు చేపడతామన్నారు. గ ల్లంతు అయిన వ్యక్తిది నెల్లిపూడిగా భావిస్తున్నా రు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఆర్‌పీ రోడ్డులో
బోల్తా కొట్టిన కారు
ముగ్గురికి తీవ్ర గాయాలు
పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో పి.గన్నవరం శివారు తాటికాయలవారిపాలెం వద్ద గురువారం రాజమహేంద్రవరం వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి కొబ్బరి తోటలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరగుప్తం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సుష్మ, అజుల్‌తో పాటు సుష్మ అక్క అలేష్ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకి కారులో వెళుతున్నారు. తాటికాయలవారిపాలెం కనకదుర్గమ్మ గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి పల్టీ కొట్టింది. అనంతరం ఒక బిల్డింగ్ గోడను ఢీకొని కారు ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని కారు నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో పి.గన్నవరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం వారిని రాజమహేంద్రరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ధ్వంసం అయింది. సుష్మ, అజుల్‌కు ఇటీవల వివాహం జరిగింది. వారిద్దరూ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఉద్యోగులు. ఇంటి నుంచి డ్యూటీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.


