రాములోరి పెళ్లి.. రాతిరేళే మళ్లీ! | - | Sakshi
Sakshi News home page

రాములోరి పెళ్లి.. రాతిరేళే మళ్లీ!

Mar 27 2026 8:53 AM | Updated on Mar 27 2026 8:53 AM

పిఠాపురం: ప్రపంచమంతా శ్రీరామనవమికి శ్రీసీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తుంటారు. కాని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం చీకటి పడ్డాకే శ్రీరాముని కల్యాణం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు. చేబ్రోలు శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ప్రాచీనమైనది. 1800వ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించారు. అప్పట్లో పిఠాపురం రాజావారి అధీనంలో ఉన్న దేవాలయాల్లో ఇదొకటి. ఈ దేవాలయాన్ని దామర సీతాదేవి జ్ఞాపకార్థం పిఠాపురం మహారాజా రావు కుమార మహిపతి గంగాధర రామారావు బహదూర్‌ నిర్మించారు. ఇక్కడ మూలవిరాట్‌ భద్రాచలం రామచంద్రస్వామిని పోలి ఉండడం విశేషం. పూర్వం పిఠాపురం మహారాజా వారు తమ ఆస్థానంలో ఉన్న అన్ని రామాలయాల్లో శ్రీరాముడి కల్యాణాలు తన చేతుల మీదుగా జరిపించేవారు. దానిలో భాగంగా రాజావారు పిఠాపురంలో ఉన్న దేవాలయాలను సందర్శించి చివరిగా గొల్లప్రోలు ఆలయాలను సందర్శిస్తూ చేబ్రోలు చేరుకొనే సమయానికి చీకటి పడేది. రాజా వారు వచ్చిన తర్వాతనే కల్యాణం జరిపించడం వల్ల చివరకు రాత్రి సమయంలో స్వామి వారి కల్యాణం జరుగుతుండేది. దీంతో ఇది ఆచారంగా మారిపోయింది. రాజుల కాలం పోయినప్పటికి అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాతే పెళ్లి తంతు ప్రారంభమవుతుంది. కల్యాణం పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటుతుంది. అలా శ్రీరామనవమి నాడు కల్యాణం ప్రారంభమై (అర్ధరాత్రి 12 గంటలు దాటాక) మరునాడు పూర్తవుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ కల్యాణ ఉత్సవాలు చేస్తుంటారు. ఇదే చేబ్రోలు గ్రామంలో వీధుల్లో ఉన్న పలు రామాలయాల్లో సైతం సీతారాముల కల్యాణం పగటి పూటే నిర్వహించినప్పటికి ప్రధానాలయంగా ఉన్న సీతారామస్వామి ఆలయంలోనే రాత్రి నిర్వహించడం విశేషం. ఈ ఏడాది శుక్రవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణం వేద ఘోష నడుమ వేలాదిగా తరలి వచ్చే భక్త జన సందోహం తిలకిస్తుండగా వేద పండితులు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

రాముడి గుడిలో ఆచారం గంట కొట్టడం

చేబ్రోలు శ్రీసీతారామాలయంలో అనాదిగా ఒక ఆచారం అమలవుతోంది. ఆలయంలో ఉత్సవాల వేళ ప్రతీ రోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వాహనాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించే సమయంలో ముందు జేగంట మోగిస్తుంటారు. దీనిని గ్రామంలో ఒక కుటుంబం అనాదిగా నిర్వహిస్తోంది. పూర్వం యుద్ధాలు చేసే సమయంలో సైన్యానికి ముందు జేగంట మోగించడం ఆచారం కాగా ఉత్సవాలలో స్వామివారి వాహనాలకు ముందు జేగంట మోగిస్తూ వెళ్లడం ఆచారంగా వస్తోంది. ఇప్పటికీ ఆలయాల్లో స్వామివారికి నైవేద్యం వేళ అర్చకులు జేగంట మోగిస్తుంటారు.

చేబ్రోలులో అర్ధరాత్రి రాముల వారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్‌)

చేబ్రోలులో శ్రీసీతారాములవారి ఆలయం

ఆచారాలకు ప్రాధాన్యం

చేబ్రోలు రామాలయంలో ఎక్కడా లేని విధంగా ఆచారాలు ఉంటాయి. వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొని ఆచారాలను పాటించి ఉత్సవాలను విజయవంతం చేస్తుంటారు.

– కె సాత్వికాచార్యులు, ఆలయ అర్చకులు, శ్రీ సీతారామ స్వామి ఆలయం, చేబ్రోలు

వీధికో వాహన సేవ

సాధారణంగా ఏ దేవుడి వాహన సేవలైనా గ్రామమంతా తిరుగుతారు. రోజుకో వాహన సేవ జరిగినా గ్రామమంతా తిప్పుతారు. చేబ్రోలులో మాత్రం ఆచారం విభిన్నంగా ఉంటుంది. వాహనాల ఊరేగింపు ఒక్కో వాహనం ఒక్కో వీధికి మాత్రమే వెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఆలయంలో వసంతోత్సవం, తెప్పోత్సవం, ఉట్టికొట్టడం వంటి తంతులు నిర్వహిస్తారు. గ్రామంలో ఒక్కో కుటుంబం ఒక్కో తంతు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆయాఽ వీధుల్లో ఉన్న వివిధ వర్గాల వారు ఆయా సేవల్లో పాల్గొని స్వామి వారి వాహనానికి స్వాగతం పలికి పూజలు నిర్వహిస్తారు. అందరికీ దర్శన భాగ్యం కలిగించే విధంగా ఈ ఆచారం ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతున్నారు. మొదటిరోజు శేష వాహనం, రెండో రోజు హనుమంత వాహనం, మూడవరోజు గజవాహనము, నాలుగవ రోజు పొన్నవాహనము, ఐదవ రోజు రథోత్సవం వైభవంగా జరుగుతాయి. అనంతరం శ్రీ పుష్పయాగంతో ఈ కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

అక్కడ ప్రతి ఏడాదీ చీకటి పడ్డాకే శ్రీరాముని కల్యాణం

చేబ్రోలు సీతారామస్వామి గుడిలో

విభిన్న సంప్రదాయం

శ్రీరామనవమి సందర్భంగా

నేటి రాత్రి కమనీయ దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement