దేవరపల్లి: గోపాలపురం వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. రైతులతో బోర్డు అధికారులు చర్చించిన అనంతరం వేలం నిర్వహణాధికారి శ్రీహరి కొనుగోళ్లు ప్రారంభించారు. వేలానికి 27 బేళ్లు రాగా ట్రేడర్లు కిలో రూ.265 చొప్పున కొనుగోలు చేశారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాలకు గాను జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, దేవరపల్లిల్లో కొనుగోళ్లు బుధవారం ప్రారంభం కాగా, గోపాలపురంలో రైతులు నిలుపు చేశారు. గత ఏడాది కిలో ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ.265 ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏటా ప్రారంభ ధర కిలోకు రూ.50 పెంచి కొంటున్నారని, ఈ ఏడాది రూ.25 తగ్గించడమేమిటని అధికారులను, ట్రేడర్లను నిలదీసి, నిరసన తెలిపారు. రైతులతో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్, అధికారులు చర్చించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో, అధికారులు వేలం నిలిపివేసి వెళ్లిపోయారు. గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ కొనుగోళ్లు జరగనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. దీంతో, బోర్డు అధికారులు గురువారం మరో దఫా రైతులతో సమావేశం నిర్వహించారు. నాలుగు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, గోపాలపురంలో నిలుపు చేయడం మంచిది కాదని చెప్పారు. గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో రెండు రోజుల్లో సమావేశం జరుగుతుందని, ఆ సందర్భంగా ధరపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు వివరించారు. చివరకు రైతుల అంగీకారం మేరకు కొనుగోళ్లు ప్రారంభించారు. కిలో ప్రారంభ ధర రూ.300, సగటు ధర రూ.350 ఉంటేనే ఈ ఏడాది పంట గిట్టుబాటు అవుతుందని రైతులు స్పష్టం చేశారు. వేలంలో పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు యిల్లూరి రాంబాబు, బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరారావు, రైతు పిన్నమనేని మధుమోహన్, నాలుగు కంపెనీల ప్రతినిధులు, ఇతర రైతులు పాల్గొన్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో రెండో రోజైన బుధవారం 10 బేళ్లు కొనుగోలు చేశారు. చెరుకుమిల్లి గ్రామం నుంచి బేళ్లు వేలానికి రాగా, వేలం నిర్వహణాధికారి పి.హేమస్మిత వేలం నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ నుంచి
అనిల్ కుమార్ సస్పెన్షన్
పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు
దేవరపల్లి: గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోలంపల్లి అనిల్ కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.


