సాక్షి టాస్క్‌ఫోర్స్: యథారాజా తథాప్రజా అన్నట్లుగా ఉంది కడియం మండలంలో పరిస్థితి. మండలంలో పేరెన్నిక గల కొందరు నాయకులు చతుర్ముఖ పారాయణలో దిట్టలు. తమకున్న ఈ నైపుణ్యాన్నే ప్రజలందరూ కూడా అలవర్చుకోవాలన్న తలంపుతో పనిచేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలతో ప్రమేయం లేకుండా పేకాటరాయుళ్లను మండల ముఖ్య నాయకుల కార్యాలయంలోనే ఏకం చేసినట్లుగా చెబుతున్నారు. పేకాటల నిర్వహణలో వచ్చే లాభాల్లో నుంచి 50, 20, 20, 10 పర్సంటేజీల వంతున పంచుకునేందుకు ‘పెద్ద’ మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయంటున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా మాధవరాయుడుపాలెం సమీపంలోని నర్సరీల్లో పేకాట శిబిరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. రోజుకు రూ.మూడు లక్షల వరకు లాభాలు కూడా వచ్చాయంటూ కడియం మండలంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిర్వాహకులతో పాటు కొందరు ముఖ్య నాయకులకు కూడా ఈ లాభాల నుంచి పర్సంటేజీలు అందుతున్నాయంటున్నారు.
కోడిపందేలు కూడా..
పేకాట రాయుళ్లను తీసుకు వచ్చే బాధ్యత, శిబిరం నిర్వహణ, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ల భద్రతా ఏర్పాట్లు వంటి విధులను కూడా పంచుకుని నిర్భీతిగా పేకాట శిబిరాలను జరిపిస్తున్నారంటున్నారు. వీటికి తోటు అదనంగా కోడిపందేలను కూడా నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిమిషాల్లో బతుకులు తలకిందులు
ప్రస్తుతం శిబిరాల్లో నిర్వహిస్తున్న పేకాటల కారణంగా కొన్ని నిముషాల వ్యవధిలోనే లక్షల రూపాయలను పోగొట్టుకుని బతుకులను తలకిందులు చేసుకుంటున్నారని మండలంలోని ప్రజలు చెబుతున్నారు. రుమాళ్ల ఆట, లోన/బైట.. అంటూ సరికొత్త పేర్లతో సాగుతున్న ఈ ఆటల్లో క్షణాల వ్యవధిలోనే లక్షల రూపాయలు చేతులు మారుతాయంటున్నారు. ఆడేవారికి ముందుగా డబ్బు వచ్చేలా మాయ చేస్తుండడంలో కొందరు ఈ మాయలో పడి ఈ శిబిరాల వద్దకు వెళ్లి చేతులు కాల్చుకుంటున్నారంటున్నారు. పేకాటలు, కోడిపందేల నిర్వహణలో రాటుదేలిన మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి ఈ శిబిరం నిర్వహణలో కీలకమని చెబుతున్నారు. శిబిరం నిర్వహణకు సిండికేట్ అయిన పెట్టుబడిదారులు రాజకీయాలకు అతీతంగా జట్టు కట్టడంపై ప్రజలు విస్తుబోతున్నారు.
నర్సరీల్లో యథేచ్ఛగా పేకాట శిబిరాలు
నీకింత.. నా కింత అంటూ
వాటాల పంపకాలు
పార్టీలకతీతంగా ఏకమైన నాయకులు
విస్తుబోతున్న ప్రజలు


