దగ్గురలో ముప్పు | - | Sakshi
Sakshi News home page

దగ్గురలో ముప్పు

Mar 24 2026 7:59 AM | Updated on Mar 24 2026 7:59 AM

క్షయను నిర్లక్ష్యం చేయొద్దు

సకాలంలో చికిత్సతో వ్యాధి నయం

డాట్స్‌ థెరపీతో నివారణ సాధ్యం

నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం

ఆలమూరు/ రాయవరం: దగ్గరలోనే ముప్పు ఉంది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లొంగదీసుకుంటోంది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే నివారణ సాధ్యమవుతోంది. ఈ ప్రాణాంతక ట్యూబర్‌ క్యులోసిస్‌ (క్షయ) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 2028 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.

ట్యూబర్‌ క్యులోసిస్‌ అనే సూక్ష్మక్రిమి ద్వారా టీబీ వస్తుందని 1882 మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్‌కాక్‌ కనుగొన్నాడు. అప్పటి నుంచి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో కలసి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రతి లక్ష మంది జనాభాలో 203 మందికి క్షయ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 123 గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 52.86 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకూ నమోదైన సుమారు ఐదు వేల కేసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ సిబ్బంది రోగుల వద్దకు వెళ్లి మందులు సక్రమంగా వాడే విధంగా చైతన్యం నింపుతున్నారు. దీంతో వ్యాధి త్వరితగతిన తగ్గుముఖం పట్టి ఏటా రోగుల సంఖ్య తగ్గుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ 2,601 మంది క్షయ బాధితులను గుర్తించారు. ఇందులో 1,780 మంది పూర్తి వైద్యం పొందగా, 821 మంది ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. 549 మందికి దాతల ద్వారా ఫుడ్‌ బాస్కెట్‌ పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సీబీ నాట్‌ మిషన్‌ ఉంది. నమోదవుతున్న కేసుల్లో చాలామందికి డాట్స్‌ కీమో థెరపీ ద్వారా నయం చేయడం జరుగుతుంది.

మూడు రకాలు

క్షయ శరీరంలోని ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ద్రవాల తడితో కూడిన (వెబ్‌ టైప్‌) మొదటి రకం కాగా, ఉదరకోశ కండరాలను ముద్దలా చేసే పొడిరకపు (డ్రై టైప్‌) రెండో రకం, శరీరంలో కంతుల మాదిరిగా సంభవించే (ఒమెంటమ్‌) మూడో రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినప్పుడు కాని దగ్గినప్పుడు కాని నోటి, ముక్కు నుంచి వెలువడే గాలిలోని తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా కారకాలతో ఇతరులకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డాట్‌ చికిత్స ద్వారా కాని నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్‌డీసీ విధానంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది.

వ్యాధి గుర్తింపు ముఖ్యం

క్షయ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, వైద్యుల సూచనలు పా టించి పూర్తి కాలం వైద్యం తీసు కుంటే నయం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించకుంటే ఆ రోగి ఏడాదికి 10–15 మందికి వ్యాధిని కలగజేస్తాడు. క్షయ వ్యాధికి అవసరమైన మందులు ప్రతి పీహెచ్‌సీలో ఉచితంగా అందజేస్తారు. డయాబెటిక్‌ రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. –ఎన్‌.వసుంధర, జిల్లా క్షయ నివారణ

అధికారి, రాజమహేంద్రవరం

నివారణకు ప్రత్యేక చర్యలు

క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి సత్వరమే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన విలువైన మందులను అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చూస్తుంన్నాం. అలాగే పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నాం.

–ఎం.సుమలత, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ, కొత్తపేట

వ్యాధి లక్షణాలివే..

క్షయ సోకిన రోగికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అప్పుడే క్షయగా అనుమానించాలి. సాయంత్రం పూట జ్వరం రావడం, నిద్ర పట్టకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం తదితర కారణాలతో రోగి నీరసించిపోతాడు. క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తొందరగా వస్తుంది. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్‌ వ్యాధికి గురైన వారిలో మూడో వంతు క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. క్షయ వ్యాధి దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా, మాట్లాడిన సమయంలో వ్యాధికారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లగా బయటకు వస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చినప్పుడు క్షయ వ్యాధికి గురవుతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ టీకాను

అందించాలి.

ఫ దగ్గు వచ్చినప్పుడు నోటికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాలి.

ఫ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నిర్ధేశించిన సమయం వరకూ మందులు వాడాలి.

ఫ వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement