పెట్రోల్‌ బంకు వద్ద మోటార్‌ సైకిల్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకు వద్ద మోటార్‌ సైకిల్‌ దగ్ధం

Mar 24 2026 7:59 AM | Updated on Mar 24 2026 7:59 AM

సురక్షితంగా వాహనచోదకులు

పి.గన్నవరం: పోతవరం గ్రామ శివారులో ఉన్న బంకు వద్ద ఒక మోటారు సైకిల్‌ కాలిపోయింది. దానిపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన బాలు అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలను అమలాపురం రూరల్‌ మండలం బండారులంక హైస్కూల్‌లో ప్రైవేట్‌గా రాస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం జరిగిన సైన్స్‌ పరీక్షకు ఆ విద్యార్థిని తండ్రి గంగులూరి రాజు, తల్లి జ్యోతి మోటారు సైకిల్‌పై బండారులంకకు తీసుకువచ్చారు. పరీక్ష రాసిన అనంతరం మోటారు సైకిల్‌పై స్వగ్రామానికి తిరిగి బయల్దేరారు. పోతవరంలోని బంకు వద్ద పెట్రోల్‌ కొట్టించుకుని తిరిగి మోటారు సైకిల్‌ స్టార్ట్‌ చేస్తుండగా, సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో రాజు మోటారు సైకిల్‌ను బంకు నుంచి కాస్త ముందుకు తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంకు సిబ్బంది ఏబీసీ ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అమలాపురం నుంచి వచ్చిన ఫైరింజన్‌ మంటలను అదుపు చేసింది. మోటారు సైకిల్‌ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. బంకు వద్ద సరైన ఫైర్‌ సేఫ్టీ లేదని, నాలుగు ఏబీసీ ఎక్విప్‌మెంట్స్‌లో రెండు మాత్రమే పనిచేశాయని, మంటలు ఆర్పేందుకు వాటర్‌ పైపు కూడా లేదని, దీంతో మోటారు సైకిల్‌ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు రాజు ఆరోపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement