● 25 నుంచి వర్జీనియా
పొగాకు కొనుగోళ్లు
● 5 వేలం కేంద్రాల్లో ఏర్పాట్లు
● 12,612 మంది రైతులు
● 14,412 బ్యారన్లు
● 80 మిలియన్ల ఉత్పత్తి అంచనా
దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు వేలం కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు కొనుగోళ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
1962 నుంచి..
రాజమహేంద్రవరం రీజియన్ ఐదు వేలం కేంద్రాల పరిధిలోని రైతులు ఉత్తర తేలిక నేలల్లో (ఎన్‌ఎల్‌ఎస్) దాదాపు 60 సంవత్సరాలుగా వర్జీనియా పొగాకును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 1962లో దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో పొగాకు సాగుకు శ్రీకారం చుట్టారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఆర్థికంగా నిలదొక్కుకుని, జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పండిస్తున్న పొగాకుకు దీటుగా నాణ్యమైన పొగాకు పండించడంలో మన రైతులు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. దీంతో, ఇక్కడ పండించిన పొగాకు ఎక్కువగా చైనా, రష్యా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. మన పొగాకులో 90 శాతం.. సిగరెట్ల తయారీకి వినియోగిస్తున్నారు.
29,132 హెక్టార్లలో..
ఈ ప్రాంతంలోని 12,612 మంది రైతులు, 2025–26 పంట కాలంలో 14,412 బ్యారన్లు కలిగి ఉన్నారు. వీరు మొత్తం 29,132 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 28,011 హెక్టార్లు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో 1,120 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. తొర్రేడు ప్రాంతంలో 893 మంది రైతులు 964 బ్యారన్లు కలిగి ఉన్నారు. తాము పండించిన పొగాకును వీరు దేవరపల్లి వేలం కేంద్రానికి తెచ్చి, అమ్ముకోవలసి ఉంది. ఈ ఏడాది పొగాకు ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
49.32 మిలియన్
కిలోలకు అనుమతి
ప్రస్తుత పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల పరిధిలో 49.32 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ, సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో దాదాపు 80 మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. గత ఏడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది మార్కెట్లో కిలోకు ధర గరిష్టంగా రూ.453, కనిష్టంగా రూ.250, సగటున రూ.297.50 చొప్పున లభించింది.
గత ఏడాది ధరలు ఇలా..
గత ఏడాది ఈ ప్రాంతంలో బ్రైట్ గ్రేడ్ 45.13, మీడియం గ్రేడ్ 31.19, లో గ్రేడ్ 7.56 మిలియన్ కిలోల చొప్పున ఉత్పత్తి జరిగింది. బ్రైట్ గ్రేడుకు కిలోకు సగటున రూ.347.93, మీడియం గ్రేడుకు రూ.270.60, లో గ్రేడుకు రూ.132 చొప్పున ధర లభించింది. అత్యధిక ఉత్పత్తి జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో జరిగింది. దేవరపల్లి వేలం కేంద్రంలో కిలో అత్యధిక సగటు ధర రూ.311 పలికింది. జంగారెడ్డిగూడెం–1లో రూ.299, జంగారెడ్డిగూడెం–2లో రూ.300.66, కొయ్యలగూడెంలో రూ.296.60, గోపాలపురంలో రూ.296.57 చొప్పున కిలో సగటు ధర లభించింది.
రూ.2,664 కోట్ల
పొగాకు అమ్మకాలు
2024–25 పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల్లో 200 రోజుల పాటు వేలం నిర్వహించగా రూ.2,664 కోట్ల విలువైన 83.88 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయి. గత పంట కాలంలో 14,754 మంది రైతులు 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. 6,79,450 బేళ్లు కొనుగోలు చేశారు. అయితే లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు నిరాకరించారు. కిలో రూ.50 పలికినప్పటికీ కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో సుమారు 10 లక్షల కిలోల లో గ్రైడ్ పొగాకు రైతుల వద్దనే ఉండిపోయింది.


