తొలిసారి ఫస్ట్‌ ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిసారి ఫస్ట్‌ ర్యాంక్‌

Mar 23 2026 8:31 AM | Updated on Mar 23 2026 8:31 AM

అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ వాట్సాప్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం 73.7 శాతం భక్తుల సంతృప్తితో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదివారం ఈ విషయం తెలిపారు. దేవస్థానాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం ప్రారంభించాక అన్నవరం ప్రథమ స్థానంలో రావడం ఇదే తొలిసారి. తాజా సర్వేలో 65.9 శాతంతో శ్రీశైలం ఏడో స్థానంలో నిలిచింది. 73.6 శాతంతో రెండో స్థానంలో నిలచిన ద్వారకా తిరుమల కన్నా అన్నవరం దేవస్థానం 0.1 శాతం మాత్రమే ఎక్కువ పొందింది. స్వామివారి దర్శనంపై 76.6 శాతం, మౌలిక వసతుల కల్పనపై 71.5 శాతం, ప్రసాదం నాణ్యతపై 79.9 శాతం, పారిశుధ్య ఏర్పాట్లపై 66.3 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివాహ బృందాలు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సాయంత్రం వరకూ విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.

యుద్ధంతో ప్రపంచ

దేశాలన్నింటికీ నష్టమే

ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్‌ అన్నారు. యుటీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్‌ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్‌ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్‌, ఆమెరికాలు ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్‌ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యుటీఎఫ్‌ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement