● భక్తుల కొంగుబంగారం విజయదుర్గా పీఠం
● భక్తులను బంధువులుగా పిలిచే ‘గాడ్’
రాయవరం: అక్కడ అడుగుపెట్టగానే ప్రశాంత వాతా వరణం కనిపిస్తుంది. నిత్యం దేవీ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచే ఆ ప్రదేశానికి వెళ్లగానే బంధువుల మాదిరి పలకరింపులే కాదు.. మానసిక చింతతో వెళ్లే వారి బా ధలను తొలగించే సలహాలు సైతం అందుతాయి. అదే భక్తులకు కొంగుబంగారంగా రాయవరం మండలం వెదురుపాకలో భాసిల్లుతున్న విజయదుర్గా పీఠం.
పుట్టినప్పటి నుంచే ‘గాడ్’
పీఠం వ్యవస్థాపక అధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం పుట్టినప్పటి నుంచే ‘గాడ్’గా పిలుపు అందుకున్నట్లు భక్తులు చెబుతారు. 1972 ఆగస్టు 18వ తేదీన స్వయంగా జగన్మాత వ్యాఘ్రవాహినిగా దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ ఈ పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 1989 లో శృంగేరి జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి ఆదేశంతో భారతీతీర్థ స్వామి చేతుల మీదుగా అష్టభుజాలతో కూడిన విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఈ పీఠంలో జరిగింది. ఇక్కడ నిత్యం పలు పూజలు నిర్వహిస్తారు. విజయదుర్గాదేవికి శ్రీచక్రార్చన, గణపతి, నక్షత్ర, నవగ్రహ, మృత్యుంజయ, రుద్ర, దుర్గా హోమాలు నిర్వహిస్తారు. వివిధ సమస్యలు, మానసిక అశాంతితో పీఠానికి వచ్చే వారికి ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పీఠానికి వస్తారు. భక్తులను గాడ్.. అబ్బాయి, అల్లుడు, కూతురు, కోడలు వంటి వరుసలతో పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ.. భక్తుల సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందజేస్తారు.
ఏటా శరన్నవరాత్ర వేడుకలు
పీఠంలో ఏటా శరన్నవరాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీనికి దూర ప్రాంతాల వారు ముందుగానే చేరుకుంటారు. ఆ పది రోజులూ భక్తులు స్వయంగా కలశాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటారు. పీఠాధిపతి ‘గాడ్’ జన్మదిన వేడుకలను ఏటా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భక్తులే ఘనంగా నిర్వహించుకుంటారు. 19వ తేదీన జరిగే గాడ్ జన్మదిన వేడుకలకు వేలాదిగా తరలివస్తారు. వీటితో పాటు పర్వదినాల్లో పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేపడతారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతులు అభినవ ఉద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, సద్గురు శివానందమూర్తి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ తదితర ప్రముఖులెందరో ఈ పీఠాన్ని సందర్శించారు.
లోక కల్యాణం కోసం..
పీఠంలో లోక కల్యాణం కోసం నిత్యం పలు రకాల పూ జలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూంటారు. ప్ర త్యేక సందర్భాల్లో రాహుకేతువుల కల్యాణం, నవావరణార్చన, శ్రీనివాస కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వంటివి నిర్వహిస్తారు. టీటీడీ శ్రీదేవి, భూ దేవీ సమేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి, తిరుత్తణి దేవస్థానం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పీఠానికి అందజేశాయి.


