దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఆపై నిద్రమత్తు కారణంగా ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర ప్రాంతానికి చెందిన సియాదుల సత్యనారాయణ (52), రామారావుపేటకు చెందిన మామిడాల నారాయణమూర్తి (57), బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఎర్రచందనం మొక్కల వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం తెల్లవారు జామున తమ వ్యాపారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరికి కారులో బయలు దేరారు. ఉదయం 7 గంటల సమయంలో కారు అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తూ దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవే ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొని అటువైపు ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంతో రెండు కార్లు ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ప్రాంతం భయానకంగా మారింది. కనిగిరి వెళుతున్న కారు అద్దాలు, డోర్లు బద్దలు కొట్టి దానిలో ఇరుక్కున్న వ్యక్తులను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఆ కారులోని సియాదుల సత్యనారాయణ, మామిడాల నారాయణమూర్తి మృతి చెందగా, వీరితో పాటు ఉన్న బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో గోపాలపురం ఏరియా అసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారులోని ఏలూరు తంగెళ్లమూడికి చెందిన చిత్తి సలీం (44) అక్కడికక్కడే మృతి చెందాడు. సలీం రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లులో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. రంజాన్‌కు ఏలూరు వెళ్లి తిరిగి రాజమహేంద్రవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముందు ఈ కారునే ఢీకొంది
కనిగిరి వెళ్తున్న కారు ముందుగా ఏలూరుకు చెందిన పరసా కోటేశ్వరరావు కారును ఢీకొంది. కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ద్రాక్షారామలో శివాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోటేశ్వరరావు చాకచక్యంగా తప్పించుకున్నారు. కారు దెబ్బతినగా, కోటేశ్వరరావు, అతని భార్య తేజస్విని స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు ఇద్దరు పిల్లలు, డ్రైవర్ క్షేమంగా ఉన్నారు. వీరంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలాన్ని దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడు సలీంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అతి వేగం.. ఆపై నిర్లక్ష్యం ఆ జీవితాల్లో ‘కారు’చీకటిని నింపేసింది.. గమ్యానికి వేగంగా చేరుకోవాలనే తపనతో పాటు నిద్ర మత్తులో కారును నడపడంతో ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జరిగింది.. ఈ ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓ కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డులోకి వెళ్లి మరీ రెండు కార్లను ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి.
ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అతివేగం
డివైడర్‌ను ఢీకొన్న కారు
అవతలి వైపు దూసుకెళ్లి రెండు కార్లతో ఢీ
ప్రమాదం నుంచి బయటపడిన
ఓ కుటుంబం


