● కియోస్క్‌ల ద్వారా సేవలకు ఇబ్బంది
● టిక్కెట్లు ఎలా పొందాలో అర్థంకాక అవస్థలు
● నెట్ స్లోగా ఉండడంతో అలస్యంగా ప్రక్రియ
అన్నవరం: కొత్త విధానం తెస్తే సులువుగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ అర్థం కావాలి.. లేకుంటే అవగాహన కల్పించాలి.. అప్పుడే సత్ఫలితాలను ఇస్తోంది. అది జరగకుంటే మొదటికే మోసం వస్తుంది.. అచ్చం అలానే అన్నవరం దేవస్థానంలో కొత్తగా తెచ్చిన కియోస్క్‌ల పరిస్థితి ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, వారు టిక్కెట్లు సులువుగా పొందాలనే ఉద్దేశంతో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి భక్తులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడి రోశయ్య మండపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెషీన్లను ఉగాది పర్వదినం రోజున దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు అట్టహాసంగా ప్రారంభించారు.
ఏ సేవలు పొందవచ్చంటే..
ప్రతి పనిలో ఆధునీకత అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యలంలో భక్తులకు సులువుగా సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు స్వామివారి అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ఎటువంటి ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేందుకు వీటిని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఆచరణలో మాత్రం భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అవగాహన లేక.. అర్థం కాక
దేవస్థానంలోని రోశయ్య మండపంలో ఒకేచోట ఎనిమిది కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఓ సహాయకుడు మాత్రమే ఉండి మెషీన్లు ఎలా ఉపయోగించాలో చెబుతున్నారు. ఎనిమిది మెషీన్ల వద్ద ఉన్న భక్తుల్లో కొంతమందికి మాత్రమే అది తెలుస్తోంది. మిగిలిన వారికి అర్థం కాక తిరిగి మళ్లీ చెప్పమంటే అక్కడున్న వ్యక్తి విసుక్కుంటున్నట్టు భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఎలా వినియోగించాలో తెలిపే బోర్డు ఉన్నా, దానిని చూసైనా కొందరు అర్థం చేసుకుంటారు. అదీ ఏర్పాటు చేయలేదు.
ఒక్కోసారి గందరగోళం
కియోస్క్‌ల ద్వారా టిక్కెట్ల కోసం ఫోన్‌పే, పేటీఎం తదితర వాటి ద్వారా నగదు చెల్లించినా, ఒక్కోసారి టిక్కెట్లు రావడం లేదు. దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. ఆందోళన చెంది అక్కడున్న వ్యక్తిని అడగాల్సి వస్తోంది. ఒక్కోసారి వెంటనే టిక్కెట్ వచ్చేలా చేస్తున్నారు. కొన్నిసార్లు చాలా సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కనీసం రెండు మెషీన్లకు ఒకరు చొప్పున సహాయకుడు ఉంటే భక్తులు సులభంగా టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది. మెషీన్లు ఏర్పాటు చేసిన కరూర్ వైశ్యా బ్యాంక్ లేకుంటే దేవస్థానం ఈ ఏర్పాట్లు చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా అక్కడ వేగమైన వైఫే ఉండాలి. ఇంటర్ నెట్ స్లోగా ఉండడంతో భక్తులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అదే విధంగా ఈ కియోస్క్ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


