వాలీబాల్ పోటీల్లో
ఐసీఎఫ్ జట్టు విజేత
మలికిపురం: ఆలిండియా మహిళా వాలీబాల్ పోటీల్లో తమిళనాడు ఐసీఎఫ్ (ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ) జట్టు విజేతగా నిలిచింది. మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో అడబాల స్పోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న డే అండ్ నైట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో తలపడిన ఐసీఎఫ్ జట్టు విజేతగా నిలిచి రూ.2 లక్షల నగదు ట్రోఫీ అందుకుంది. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రన్నర్‌గా నిలిచి రూ.1.50 లక్షల నగదు ట్రోఫీ స్వీకరించింది. విజేతలకు నగదు, ట్రోఫీలను నిర్వాహకులు అందించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, నిర్వాహకులు అడబాల వీరబ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్, అల్లూరి రవిరాజు, కె.రామచంద్రమూర్తి, గెడ్డం మహలక్ష్మీప్రసాద్, దొడ్డా బాబ్జీ, కృష్ణ, మంచాల సుధాకర్‌నాయుడు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మ
ఆలయంలో చోరీ
కె.గంగవరం: మండలంలోని కుందూరులో కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఆలయంలోకి చొరబడి అమ్మవారి వెండి కిరీటం, వెండి హస్తం, బంగారు మంగళసూత్రం అపహరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూకాలమ్మకు జేజేలు
సామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి జాతర ఉత్సవాలు ఈ నెల 17న ప్రారంభం కాగా, మే 3 వరకూ జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని తోటలో వాహనాలను పార్కింగ్ చేసి, అమ్మవారిని దర్శించుకుని తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి భోజనాలు చేశారు. ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. అమ్మవారి దర్శనానికి రూ.10, రూ.30, రూ.100 టిక్కెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
అనపర్తి: రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన ఇజ్జిన సిద్ధూ (11) శనివారం తప్పిపోయి పక్కనే ఉన్న బలభద్రపురం గ్రామానికి వచ్చాడు. ఆ బాలుడిని బలభద్రపురానికి చెందిన సింగిడి వెంకటలక్ష్మి గమనించి బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కి తీసుకుని వచ్చి అప్పగించారు. ఎస్సై వి.రవిచంద్ర ఆ బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అతని నాన్నమ్మ ఇజ్జిన సీత, తండ్రి చంద్రశేఖర్‌లను పిలిపించి సిద్ధూను అప్పగించారు.


