● ఏడుగురికి గాయాలు
● బాలుడి పరిస్థితి విషమం
కాకినాడ రూరల్: కాకినాడ – పిఠాపురం రోడ్డులో తిమ్మాపురం సాయిబాబా గుడి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఇందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురం నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు తిమ్మాపురం వద్ద ఎదురుగా వెళుతున్న ఎన్‌ఫీల్డ్ బైక్, స్కూటీలను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు చిన్నారి హారిక రత్నం, చిన్నారి మణికంట, స్కూటీపై వెళుతున్న తిమ్మాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సవరం అరుణకుమార్, విజేత, వారి కుమారుడు బెన్ను సుశాంత్ (14) పాటు కారులోని భార్యాభర్తలు రమణయ్యపేటకు చెందిన మాగంటి బాబూరావు, ప్రవీణ గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు తర్వాత రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పోల్‌ను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న బాబూరావు బ్రేక్‌పై కాలు వేయడానికి బదులుగా ఎక్స్‌లేటర్‌పై వేయడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాలను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై గణేష్‌బాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
క్షతగాత్రులకు ఏపీడీ సేవలు
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ప్రయాణం చేస్తున్న ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాథ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అప్పటి వరకూ గాయపడిన క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌లోకి క్షతగాత్రులను స్థానికులతో కలసి ఆయన ఎక్కించారు.


