● కాగిత పూలతో అలంకరణకు సిద్ధం
● నవమికి సిద్ధమవుతున్న సత్యవాడ
కె.గంగవరం: సీతారాముల కల్యాణంలో ఇక్కడ ప్రత్యేకత చాటుతోంది.. కళాత్మకతను చాటుతోంది.. తరతరాలుగా ఇక్కడ అలంకరణకు పెట్టింది పేరు. జిల్లా సరిహద్దులు దాటేలా తన కీర్తిని సత్యవాడ చాటుతోంది. స్వామివారి కల్యాణ మహోత్సవం అంటే ప్రతి కుటుంబం తన సొంత ఇంట్లో వివాహంలా భావిస్తుంది. మహా శివరాత్రి తదుపరి దినం నుంచి శ్రీరాముని కల్యాణం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ స్వామివారి అలంకరణకు రేయింబవళ్లు శ్రమించి తమ కళా నైపుణ్యంతో శ్రీరామచంద్రుడిని అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. సత్యవాడ గ్రామంలో నాలుగు వీధుల్లో సీతారాముల ఆలయాలు ఉంటాయి. ఆయా ఆలయాల వద్ద ప్రతి వీధి వారు కల్యాణోత్సవాలు జరపడం ఇక్కడ ఆనవాయితీ. 150 ఏళ్లుగా ఏటా ఉగాది పర్వదినం రోజున శ్రీరాముని కల్యాణానికి రాట ముహూర్తం చేస్తారు. చలువ పందిళ్లు వేసి, వంశపారపర్యంగా వస్తున్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాగితపు పూలతో అలంకరించి ఆ శ్రీరామునికి తమ కళాత్మకతను నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఏటా శ్రీరామ నవమికి స్వయంశక్తితో తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న కాగితపు పూల అలంకరణ, చలువ పందిళ్లను రూపొందించడంలో సత్యవాడ గ్రామస్తులు ప్రత్యేకత చాటుతున్నారు. వీరు తరతరాలుగా తమలోని కళా నైపుణ్యాన్ని శ్రీరామునికి నివేదిస్తూ తమలోని భక్తి భావాన్ని తెలియజేస్తున్నారు. తెల్లవారితే ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలయ్యే వీరిలో కూడా అంతర్గతంగా ఎంతో సృజనాత్మకత ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం కాగితపు పూల తయారీలో అందెవేసిన చేయి. తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భద్రాచలంలో మాదిరిగానే ఏటా ఇక్కడ శ్రీరామ నవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక ద్వారా తమ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే ఉద్దేశంతో రంగురంగుల కాగితాలతో పువ్వులను తయారు చేసి వాటిని నవమికి వేసిన చలువపందిళ్లలో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఆ విధంగా మొదలైన ఈ వంశపారంపర్య మహోత్సవాన్ని ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా నేటికీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు ఇళ్లకు చేరుకున్నా. ఈ నెల 27 నుంచి 30 వరకూ నవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.


