భూ బాదుడు | - | Sakshi
Sakshi News home page

భూ బాదుడు

Jan 28 2026 11:07 AM | Updated on Jan 28 2026 11:07 AM

భూ బాదుడు

భూ బాదుడు

సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ బాదుడే.. బాదుడు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు.. ఇప్పుడు భూముల ధరలు మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్స్‌, స్టాంపుల శాఖ కమిషనర్‌ గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్‌ విలువలను సవరించనున్నారు. దీనిపై ప్రజలు తమ సలహాలు, అభ్యంతరాలు తెలపాలని జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో కోరారు.

సవరణలు ఇలా..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల సవరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా చేపడతారు. సదరు భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయిస్తారు. సవరించిన విలువలకు రివిజన్‌ కమిటీ ఆమోద ముద్ర వేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా.. ఈ నెల 25 నుంచి సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రతిపాదిత ధరల వివరాలు పొందుపరిచారు. వీటిపై గురువారం వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తుది ధరలకు 31వ తేదీన ఆమోదం తెలుపుతారు. రివిజన్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే పెంచిన ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ చేసింది.

రిజిస్ట్రేషన్లు మరింత భారం

జిల్లావ్యాప్తంగా 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ప్రతి రోజూ 500 నుంచి 1,000 రిజిస్ట్రేషన్లు జరుగుతూంటాయి. ప్రతి రోజూ సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు ధరలు పెంచారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఆయా భూములకున్న విలువల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచనున్నారు. కక్షిదారులు సాధారణంగా బయటి మార్కెట్‌లో భూములను అధిక ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం ఆ ధరలను పరిగణనలోకి తీసుకోదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు కక్షిదారులు చలానా రూపంలో ఫీజులు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇప్పటికే బయట భూముల ధరలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు అధికంగా ఉండటంతో భూములు కొనాలనుకున్న వారు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి భూముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు సామాన్యులకు మోయలేని భారంగా మారనున్నాయి. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోగా.. ప్రస్తుతం ప్రభుత్వం భూముల ధరలు పెంచుతూండటంతో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది.

నివాస స్థలాలపై సైతం..

కమర్షియల్‌ స్థలాలే కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనివలన రాజమహేంద్రవరం నగరంతో పాటు దివాన్‌ చెరువు, లాలాచెరువు, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, మోరంపూడి జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్‌సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్‌, సినిమా హాళ్లు, పరిశ్రమలు, పూరిళ్లు తదితర నిర్మాణాల విలువలను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం చదరపు అడుగుకు 10 నుంచి 30 శాతం వరకూ వీటి మార్కెట్‌ విలువ పెంచనున్నారు. ఫలితంగా సామాన్యులు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడనుంది.

ఫ కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ప్రస్తుతం గజం రూ.8 వేల నుంచి రూ.16 వేలు పలుకుతోంది. 10 శాతం పెంచితే.. రూ.800 నుంచి రూ.1,600 వరకూ పెరిగి, గజం భూమి ధర గరిష్టంగా రూ.17,600కు చేరుతుంది.

ఫ రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరులో ప్రస్తుతం గజం భూమి విలువ రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. దీనికి 10 శాతం కలిపితే రూ.1,500 పెరుగుతుంది. దీంతో గజం విలువ రూ.17 వేలకు చేరుతుంది.

ఫ భూమి విలువలో 1.5 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. పెంచనున్న ధరల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెరుగుతాయి. రాజమహేంద్రవరంలో ఆయా ప్రాంతాలను బట్టి 3 నుంచి 8 శాతం వరకూ పెరుగుదల ఉంటుంది.

రియల్‌ రంగంలో కలకలం

ప్రభుత్వ నిర్ణయం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి భూముల ధరలు పెంచారని, ఇప్పుడు మరోసారి పెంచుతూండటంతో వ్యాపారం కుదేలవుతుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ముడి సరకుల ధరలు పెరగడంతో నిర్మాణ రంగం సైతం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో క్రెడాయ్‌ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు ఇప్పటికే ఆర్థిక మంత్రిని సంప్రదించారని, ధరల పెంపుపై పునరాలోచించాలని విన్నవించారని సమాచారం.

10 నుంచి

30 శాతం వరకూ పెంపు

జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్లతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. గ్రోత్‌ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఇప్పటికే ప్రకటించారు. సగటున 10 నుంచి 30 శాతం వరకూ పెంపుదల చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో భూముల ధరలు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఫ రివిజన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

ఫ సలహాలు, సూచనలకు రేపటి వరకూ అవకాశం

ఫ 31న తుది నిర్ణయం

ఫ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి..

ఫ 10 నుంచి 30 శాతం పెరగనున్న వైనం

ఫ భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు

ఫ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక

రెండోసారి పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement