అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం చుట్టూ క్యూలో రద్దీ ఏర్పడింది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం దర్శనం చేసుకున్నారు. కాగా.. దాతల ఆర్థిక సాయంలో 10,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. స్వామివారికి పూల అలంకరణ, ప్రసాదాలను కూడా దాతల సహకారంతో పంపిణీ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయంలో ప్రవేశపెట్టిన స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం వంటి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామన్నారు.
నేటి నుంచి చందన యాత్ర మహోత్సవాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్‌లో గల వరహాలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకూ 24వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరంగం మదుభయ వేదాన్తాచార్య పీఠం ట్రస్టు ఆధ్వర్యాన త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి మంగళా శాసనాలతో జరిగే ఈ మహోత్సవాలకు వరహాలక్ష్మీ నృసింహస్వామి ట్రస్ట్, ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అర్చకుడు అవసరాల కిరణ్ స్వామి మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని, 30వ తేదీ మహాపూర్ణాహుతితో పూర్తవుతాయన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర
సీటీఆర్‌ఐ: సనాతన ధర్మపరిరక్షణకు పాదయాత్ర చేస్తున్నానని గాడాల మహాలక్ష్మీ సమేత చిన్న వేంకటేశ్వరస్వామివారి పీఠాధిపతి చిన్న వెంకన్నబాబు అన్నారు. ఇప్పటికే 19 సార్లు ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేసిన ఆయన.. 20వ పాదయాత్రకు శనివారం ఉదయం 7 గంటలకు దేవీచౌక్ నుంచి శుభారంభం చేశారు. తొలుత అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆయన వెంట 40 మంది శిష్యులు బయలుదేరగా, రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా కొవ్వూరు చేరుకున్నాక అక్కడ మరో పది మంది చేరారు. దీంతో 50 మందితో ద్వారకా తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న వెంకన్నబాబు మాట్లాడుతూ వంద కిలోమీటర్ల పొడవునా ప్రతి కిలోమీటరుకు 150 మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాల చొప్పున... మొత్తం 15 వేల ఫొటోలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
నేడు, రేపు ప్రత్యేక రైళ్ల రాకపోకలు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ఆది, సోమవారాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్నం – చర్లపల్లి (08517), సోమవారం చర్లపల్లి – విశాఖపట్నం (08518) రైళ్లు తిరుగుతాయన్నారు. జిల్లాలోని సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఆగుతాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ


