ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
● ఒకరి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లోడు లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో కో (సహాయ) డ్రైవర్ మృతి చెందగా.. డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి కథనం ప్రకారం.. అర్ధరాత్రి కావడంతో తుని మండలం వి.కొత్తూరు వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన కర్రల లోడు లారీని రోడ్డుకు పక్కగా నిలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు ఆ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ పక్కన ఉన్న కో (సహాయ) డ్రైవర్ ఎస్.రమేష్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఉంగుటూరు మండలం ఆతుకూరు గ్రామంగా గుర్తించారు. డ్రైవర్ గణేష్, ప్రయాణికులు యశ్వంత్ (హైదరాబాద్), ఎం.సత్యమూర్తి (శ్రీకాకుళం) తీవ్రంగా గాయపడి క్యాబిన్‌లో చిక్కుకుపోయారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పట్టణ సీఐ గీతారామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు పంపించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కృష్ణమాచారి వివరించారు.
అక్కడ తరచూ ప్రమాదాలు
ఈ ప్రాంతంలోనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నారు. సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్, హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు ఉండడంతో రక్షణ, విశ్రాంతి లభిస్తుందన్న ఆలోచనతో డ్రైవర్లు వాహనాలను నిలిపి తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చే ఇతర వాహనదారులు ఆగి ఉన్న వాహనాలను పూర్తి స్థాయిలో గుర్తించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నాలుగు లైన్లగా జాతీయ రహదారిని ఏర్పాటు చేసినప్పుడు పది కిలో మీటర్లకు ఒకచోట పార్కింగ్ స్థలాన్ని కేటాయించినప్పటికీ ఆ ప్రదేశాల్లో రాత్రి వేళల్లో వాహనాలు నిలపడం లేదు. హైవే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని డ్రైవర్లు భయాందోళనలతో ఆయా పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపకుండా రక్షణ లభిస్తుందన్న నమ్మకంతో ప్రధాన కూడళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు


