పరంధామానికి చేరుకున్న పరమాత్మ
● సామవేదం షణ్ముఖ శర్మ
● నేటితో ముగియనున్న ప్రవచన యజ్ఞం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భూభారం తగ్గించడానికి వచ్చిన పరమాత్మ తన పని పూర్తి చేసుకుని పరంధామానికి చేరుకున్నారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఆయన శనివారం మౌసల పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. కాలప్రేరణతో వృష్టి, భోజక, అంధ వంశీయులు మహర్షుల శాపంతో నశించారు. ద్వారకను చూడటానికి వస్తున్న విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు పిండారకమనే క్షేత్రానికి వచ్చారు.
కొందరు యాదవులు సాంబుడిని సీ్త్రగా అలంకరించి, ఈమె భబ్రుడు అనే యాదవుని భార్య, ఈమెకు పుట్టబోయేది కొడుకా, కూతురా చెప్పాలని కోరారు. భాగవతంలో పైన చెప్పిన మహర్షులతో పాటు దుర్వాసుడు, అంగిరసుడు, వశిష్ఠుడు తదితరులు కూడా వచ్చారని వ్యాసుడు చెప్పాడని సామవేదం అన్నారు. దీంతో బలరామ, కృష్ణులు తప్ప మిగతావరందరూ ముసలం పుట్టి నాశనమవుతారని త్రికాలజ్ఞులైన మహర్షులు శపించారు. కాల స్వరూపుడైన కృష్ణుడు వారి శాపాన్ని మళ్లించగల సమర్థుడైనా, ఆ పనికి పూనుకోలేదు. కృష్ణుడి బొటన కాలి బొటన వేలిపై వేటగాడు వేసిన బాణానికి ఆయన అవతార పరిసమాప్తి జరిగింది. వేటగాడి బాణమనేది కేవలం ఒక నిమిత్తం మాత్రమేనని సామవేదం అన్నారు. అంతకు ముందే బలరాముడు యోగమార్గంలో తన స్వస్థానానికి చేరుకున్నాడు. దారకుడు తీసుకువచ్చిన వార్తతో అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. నాకు, అర్జునునికి భేదం లేదని తనతో కృష్ణుడు చెప్పాడని వసుదేవుడు అర్జునునితో చెప్పి తనువు చాలించాడు. యాదవ సీ్త్రలను తనతో హస్తినకు తీసుకువెడుతున్న అర్జునుడు ద్వారకను వీడగానే సముద్రం ఆ నగరాన్ని ముంచెత్తింది. తనను అడ్డగించిన దొంగలందరినీ అర్జునుడు నిరోధించలేకపోయాడు. కృష్ణుని భార్యలు కొందరు అగ్నిప్రవేశం చేయగా కొందరు తపస్సులో లీనమయ్యారని సామవేదం అన్నారు. మనశ్శాంతి కోల్పోయి, తేజోవిహీనుడైన అర్జునుడు వ్యాసుని ఆశ్రయించాడు. తాను ఎక్కు పెట్టిన గాండీవం విఫలైందని, తన రథానికి ముందు కనపడే కృష్ణుడు కనపడటం లేదని, ఆయన దివికి వెళ్లిపోయారని వాపోయాడు. కృష్ణ వాక్య శ్రవణం, కృష్ణ స్పర్శ, కృష్ణ దర్శనానికి దూరమైన తనకు బతకాలని లేదన్నాడు. వ్యాసుడు అర్జునుని ఓదారుస్తూ, ఇది మీరు పరలోకానికి వెళ్లే సమయమని చెబుతాడు.


