12,570 కేజీల గంజాయి ధ్వంసం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 పోలీస్ స్టేషన్లలో 201 కేసులలో సీజ్ చేసిన సుమారు 12,570 కేజీల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశానుసారం శనివారం ధ్వంసం చేశామన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉప్పాడ గ్రామం పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థలో, జిందాల్ ప్లాంట్ సహకారంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కొన్ని మాదక ద్రవ్యాల హాట్ స్పాట్లు గుర్తించామని, ఆయా ప్రదేశాలలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా గంజాయికి అలవాటు పడిన 17 మందిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అమలుకు అనుమతులు రాగా, 14 మందిని జైలుకు పంపించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఐసోలేషన్ ప్రదేశాలు, ఇతర ప్రాంతాలలో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్, డయల్ 112 సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


