కొల్లగొట్టి.. కోట్లు పట్టి..
మురారి వద్ద పోలవరం
గట్టుపై మట్టి తవ్వకాలు
పోలవరం కాలువ గట్టు నుంచి
రహదారి పనులకు తరలించిన మట్టి
సాక్షి, రాజమహేంద్రవరం: మైనింగ్ మాఫియా పేట్రేగిపోతోంది. టీడీపీ, జనసేన నేతల నేతృత్వంలో బరి తెగిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలవరం గట్టును కూడా గుల్ల చేసేస్తున్నారు. కూటమిలోని ప్రధాన నేతలే వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. వారి కనుసన్నల్లో అడ్డూ అదుపు లేకుండా గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి విక్రయించేస్తున్నారు. వెరసి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. కూటమి నేతల అవినీతి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు లారీలు’ అన్న చందంగా సాగుతోంది.
ఇదీ సంగతి
ఆటో నగర్ నుంచి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ వరకూ 52 పిల్లర్లతో రింగ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మట్టితో మెరక చేసేందుకు మురారి, కవలచర్ల పరిధిలోని పోలవరం కాలువ గట్టుపై ఉన్న మట్టిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను టెండర్లను ఆహ్వానించింది. హర్యానాకు చెందిన వారు టెండర్లు దక్కించుకున్నారు. అయితే 90 రోజుల్లో 100 లారీల మట్టి మాత్రమే తరలించేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. వారి నుంచి అనధికారికంగా మట్టి సరఫరాను దక్కించుకున్న టీడీపీ, జనసేన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కూటమి నేతల కనుసన్నల్లో...
టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి నాయకుల కనుసన్నల్లో అక్రమ దందా సాగుతోంది. మురారి, కలవచర్లల్లో పోలవరం కాలువ గట్లను రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వేసి తరలించేస్తున్నారు. కాలువకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వి, తరలించేస్తున్నారు. భారీ యంత్రాలను వినియోగించి మట్టిని ప్రభుత్వ పనుల పేరుతో ప్రైవేటు లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మురారి, కలవచర్ల ప్రాంతాల నుంచి ప్రతి నిత్యం వందల లారీల మట్టి అక్రమంగా తరలిస్తున్నారంటే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం అవుతోంది. లారీ గ్రావెల్‌ను దూరాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు.
తవ్వకాలు కొండంత!
మురారి, కలవచర్ల పోలవరం గట్టు నుంచి రోడ్డు పనుల నిమిత్తం కేవలం 3 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టిని తవ్వి, తరలించాల్సి ఉంది. కానీ కూటమి నేతల మాత్రం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తమను ఆపేవారెవరంటూ అడ్డగోలు వ్యవహారానికి తెరతీస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 85 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను ఫ్లైఓవర్ పనులకు, మరో 85 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ప్రైవేటు అవసరాలకు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి.
కన్నెత్తి చూడని అధికారులు
గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతున్నా.. ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని లారీలకు అనుమతులు తీసుకున్నారు? ఎన్ని లారీలు తరలించారు? కాలువ గట్టుపై ఏ మేరకు తవ్వకాలు చేపట్టారు? అని ఆరా తీయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు గట్టునే కొల్లగొడుతుంటే అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
ప్రజలకు ఇబ్బందులు
నిత్యం వందల లారీల మట్టి తరలిస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. వాహనాల రాకపోకల తాకిడికి సమీపంలో నివశించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల బరువుకు రహదారులపై ఉన్న మట్టి, దుమ్ము తమ ఇళ్లలోకి చేరి వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. దుమ్ము ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం తూతూ మంత్రంగా రోడ్డుపై నీళ్లు చల్లి చేతులు దులుపుకొంటున్నారు. అది గంటల వ్యవధిలోనే తిరిగి దుమ్ము లేచే స్థాయికి చేరుతోంది.
పరిమతి పోయేలా!
మురారి, కలవచర్ల ప్రాంతంలోని పోలవరం గట్టుపై నుంచి 90 రోజులకు గాను 100 లారీల మట్టి మాత్రమే తరలించాలని ఇరిగేషన్ శాఖ నిబంధనలు వెల్లడిస్తున్నాయి. వాటికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. కూటమి నేతలను ‘మనల్ని ఎవరు ఆపేదంటూ’.. పేట్రేగిపోతున్నారు. రోజుకు 500 లారీల మట్టి అక్రమంగా తరలించేస్తున్నారు. వీటిలో సగం రహదారి పనులకు, మిగిలిన మట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు లేఅవుట్లకు తరలించి రూ.లక్షలు దండుకుంటున్నారు. ఒకసారి లారీ తరలించేందుకు పెట్టిన బిల్లులను పదే పదే చూపుతూ మాయ చేస్తున్నారు. మురారి, కలవచర్ల పోలవరం గట్టు నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి మట్టిని తరలిస్తున్నారు. అక్రమ తరలింపు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. ఇంకా ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చిన 100 లారీలు పూర్తవలేదంటూ బుకాయిస్తున్నారు. రోజుకు 500ల లారీల మట్టి తరలిస్తుంటే.. ఇంకా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తికాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
టీడీపీ, జనసేన నేతల అక్రమ నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా మట్టిని తరలిస్తున్నా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.2,346 (ఒక్క లారీకి) సీజరేజి నిధులకు కూటమి నేతలు గండి కొడుతున్నట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో ఇప్పటి వరకు సుమారుగా 4 వేల లారీలకు పైగా గ్రావెల్ అక్రమ రవాణా చేసినట్లు తెలిసింది. లారీ యజమానులకు కిలో మీటర్‌కు రూ.120 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్మంతా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ తతంగం మొత్తం మురారిలోని ఓ టీడీపీ నేత, ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వానికి మాత్రం అనుమతులు ఇచ్చిన వాటిలో కొన్ని లారీలకు రూ.లక్షల్లో మాత్రమే సీనరేజీ కింద చెల్లించినట్లు తెలిసింది.
పోలవరం కాలువ గట్టుపై
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
అనుమతి ఇంత.. తవ్వుతోంది కొండంత
చెలరేగిపోతున్న మైనింగ్ మాఫియా
కూటమి నాయకుల అండదండలు
90 లారీలకు అనుమతులిస్తే..
5 వేల లారీలకు పైగా హాంఫట్
నెల రోజుల్లో రూ.1.50 కోట్లు
కొల్లగొట్టిన అక్రమార్కులు
కొల్లగొట్టి.. కోట్లు పట్టి..


