సంస్థాగత నిర్మాణంలో యువతకు ప్రాధాన్యం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
● అనపర్తిలో పార్టీ సంస్థాగత
నిర్మాణ సమావేశం
● భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు, శ్రేణులు
అనపర్తి: వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణంలో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాలి వేణు, రాజమహేంద్రవరం సిటీ, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు అద్దంకి ముక్తేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ పరిశీలకుడు గుబ్బల తులసీకుమార్ హాజరయ్యారు.
ప్రజల్లో ఉండాలి : చెల్లుబోయిన వేణు
జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ప్రజలలో ఉంటూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వారికి తెలియజేయాలన్నారు. యువత, మహిళలను పార్టీలోకి ఆహ్వానించి విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్ర తి కార్యక్రమంలోనూ అనపర్తి నియోజకవర్గం ముందుంటుందన్నారు. కూటమి నాయకుల దౌర్జన్యాలపై డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఆయన సంధించే ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి స్పందన కూడా కరవైందన్నారు.
బలంగా పనిచేయాలి: జక్కంపూడి రాజా
జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీకి పరిస్థితులు సానుకూలంగా ఉన్నా అశ్రద్ధ వహించకుండా అనుబంధ విభాగాలు ఎల్లప్పుడూ బలంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి కమిటీను ఏర్పాటు చేసిన నియోజకవర్గం అనపర్తేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో మొదటి మూడు నెలలు పార్టీ శ్రేణులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి బెత్తం పట్టుకోవడంతో కూటమి నాయకుల ఆగడాలు చాలా వరకు తగ్గాయన్నారు.
దుష్ప్రచారంతోనే ఓటమి: డాక్టర్ గూడూరి
చంద్రబాబు నాయుడు మన జగనన్నపై చేసిన దుష్ప్రచారం వల్లే ఎన్నికల్లో మనం ఓడిపోయామని, వాస్తవానికి ప్రజలందరూ మన వైపే ఉన్నారని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో దిట్ట అన్నారు. ప్రతి మూడో ఓటు కూటమికి పడే విధంగా ట్యాంపరింగ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయని ఆరోపించారు.
త్వరలో గుణపాఠం : నాగార్జున యాదవ్
ప్రస్తుతం 98 శాతం టీడీపీ నాయకులు, పోలీసులతో వైఎస్సార్ సీపీకి సమస్య లేదని, మిగిలిన 2 శాతం మంది అతిగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. ఆ వివరాలన్నీ జగనన్న టేబుల్‌పై ఉన్నాయని, వారికి తగిన గుణపాఠం ఉంటుందన్నారు. అందరికీ మేలు చేసే జగనన్నను తిరిగి సీఎం చేయడానికి కృషి చేయాలన్నారు. అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా తదితర పథకాలను సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఆయనదేనన్నారు.
ఆ చిట్టా మా దగ్గర ఉంది: డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులపై దాడులు చేస్తూ, ఇబ్బందులు పెడుతున్న వారి చిట్టా తమ వద్ద ఉందని, వారికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో నాయకులు, కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) పర్యవేక్షించారు.
సంస్థాగత నిర్మాణంలో యువతకు ప్రాధాన్యం


