ఆర్టీసీకి రూ.63 లక్షల సంక్రాంతి ఆదాయం
వైఎస్‌ఎన్ మూర్తి, జిల్లా ప్రజా రవాణా అధికారి
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకూ 262 బస్సులను నడపడం ద్వారా రూ.63 లక్షల ఆదాయం సాధించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్ మూర్తి గురువారం తెలిపారు. ఈ బస్సుల ద్వారా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు 36,821 మంది ప్రయాణికులను తరలించామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన రూట్లలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు బస్సుల మెయింటెనెన్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అలాగే ఆర్టీసీ డోర్ డెలివరీలో రాష్ట్రంలో తూర్పుగోదావరి 2వ స్థానం సాధించిందని, గత నెల 20 నుంచి ఈ నెల 19 వరకు డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు నిర్వహించామ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ముఖ్య ప్రదేశాలకు 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల పరిధిలో పార్సిళ్లను డోర్ డెలివరీ చేసే సదుపాయం ఉందన్నారు. దీనిలో భాగంగా 4,822 డోర్ డెలివరీల లక్ష్యాన్ని అధిగమించి 9,260 డోర్ డెలివరీ బుకింగ్‌లు సాధించామన్నారు. గోకవరం, కొవ్వూరు, నిడదవోలు, రాజమహేంద్రవరం సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు సేవలు అందించాలని కోరరాఉ. అతి త్వరలో డోర్ పికప్ సర్వీసు కూడా అందించబోతున్నట్లు తెలిపారు.
వసతి గృహాల్లో
మెరుగైన సౌకర్యాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి కలెక్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న వసతులపై సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు, వార్డెన్లు చొరవ చూపాలన్నారు. పనిచేయని కెమెరాలకు మరమ్మతులు చేయాలని, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దేవస్థానాల్లో కొత్త హుండీలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో భక్తుల క్యూలలో స్టెయిన్‌లెస్ స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్న హుండీల ఎత్తు ఎక్కువగా ఉన్నందున వాటిలో కానుకలు సమర్పించడానికి భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఆర్టీసీకి రూ.63 లక్షల సంక్రాంతి ఆదాయం


