విద్యుత్ పొదుపు పాటించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్‌ను తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అవసరమున్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ పొదుపు వల్ల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ ఈపీడీసీఎల్ ఉద్యోగులు స్థానిక వై జంక్షన్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దేవీచౌక్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈపీడీసీఎల్ ఎస్‌ఈ టి.తిలక్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, జీపీబీ నటరాజన్, ఎన్.నారాయణ అప్పారావు, పర్సనల్ ఆఫీసర్ పి.స్టీఫెన్, సీనియర్ అకౌంట్స్ అధికారి కె.ఆదినారాయణమూర్తి, సర్కిల్ ఆఫీస్ ఈఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


