పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 25 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 850 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల మురళి తెలిపారు. ఈ నెల 18న బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంగళగిరికి చెందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కార్యదర్శి జీవీ సత్యనారాయణమూర్తి, ఏయూ రీజియన్ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కాంస్య పతక
విజేతకు అభినందనలు
రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కార్మికుడు అర్జి బాలకృష్ణ టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల విభాగం స్క్వాడ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణను నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో బాలకృష్ణ మరిన్ని ప్రపంచ పోటీల్లో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, శానిటరి ఇన్‌స్పెక్టర్ ధనరాజ్ పాల్గొన్నారు.
సాయుధ దళాల
పతాక నిధికి విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది రూ.8,00,700 విరాళాలు సేకరించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న 8 వేల మంది మెప్మా సిబ్బంది ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఈ విరాళం సమకూర్చారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో మెప్మా పీడీ బి.ప్రియంవదతో కలసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.కృష్ణారావుకు మంగళవారం అందజేశారు. జేసీ భరత్ మాట్లాడుతూ, మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమం, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగిస్తారని చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా బాట
తొలగింపు
పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం శివారు నడిగాడి వద్ద వశిష్ట గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు ఏర్పాటు చేసిన బాటలను మైన్స్ ఆర్‌ఐ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీతో తొలగించారు. ర్యాంపు వద్ద గస్తీ నిర్వహించాలని వీఆర్వో కడలి వెంకటేశ్వరరావుకు మైన్స్ ఆర్‌ఐ సూచించారు. అంతకు ముందు పుచ్చల్లంక రేవును కూడా తనిఖీ చేశారు. అక్కడ లంకలో ఉన్న ఒక జేసీబీని సీజ్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండీ రెహ్మాన్ అలీ, సర్వేయర్ కె.శ్రీధర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
21న పల్స్ పోలియో
అమలాపురం రూరల్: ఈ నెల 21వ తేదీని పల్స్ పోలియో నిర్మూలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని, ఐదేళ్ల లోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు వేయించుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. బస్ స్టాండ్లు, ఆస్పత్రులు, మేళాలు, బజార్లలో 21 నుంచి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయన్నారు.
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం


