‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు.


