ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

Dec 17 2025 6:53 AM | Updated on Dec 17 2025 6:53 AM

ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

ఇక బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

రాయవరం: మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తారు. ఆరేళ్ల నుంచి 14ఏళ్ల లోపు చిన్నారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతారు. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం విద్యాశాఖ చేపట్టింది. సమీప ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మండలం దీనికి ఎంపికైంది.

కో–లొకేషన్‌ ప్రక్రియ దిశగా..

మహిళ, శిశు అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్‌), విద్యాశాఖలు సంయుక్తంగా కో–లొకేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, ప్రాథమిక విద్యను సమర్థంగా అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు. పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులున్నాయా? లేదా? మరుగుదొడ్లు, తాగునీరు, వంటగది, ఆటస్థలం, స్టోర్‌ రూమ్‌, ప్రహరీ, విద్యుదీకరణ తదితర వసతులను పరిశీలిస్తారు. మ్యాపింగ్‌ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం పూర్వ, ప్రాథమిక విద్యను ఒకే ప్రాంగణంలో అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇదిలా ఉంటే 2023లోనే కోలొకేటెడ్‌ పాఠశాల ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేశారు. జిల్లాలో కపిలేశ్వరపురం మండలం టేకి బీసీ కాలనీలోని నంబర్‌ – 1 పాఠశాలను కో లొకేటెడ్‌ పాఠశాలగా ఎంపిక చేసి, పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ కార్యకర్తకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని కోలొకేషన్‌ పాఠశాలల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. పి.గన్నవరం మండలంలో 84 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనాల స్థితిగతులను పరిశీలించిన మండల స్థాయి కమిటీ 12 స్కూళ్లను కో లొకేటెడ్‌ పాఠశాలలుగా గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement