ఓపెన్‌గా దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌గా దోపిడీ!

Dec 17 2025 6:53 AM | Updated on Dec 17 2025 6:53 AM

ఓపెన్‌గా దోపిడీ!

ఓపెన్‌గా దోపిడీ!

సాక్షి, రాజమహేంద్రవరం: ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదు. కానీ, అధికార అండతో ఇసుక మాఫియా దోపిడీ ‘ఓపెన్‌’ చేసింది. కూటమి నేతల అండదండలతో నిబంధనలను గోదావరిలో తొక్కి మరీ అక్రమ తవ్వకాలతో చెలరేగుతోంది. ఇసుక అక్రమార్కులు నదిలోకి యంత్రాలను దించి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం వందల వేల టన్నుల ఇసుకను దర్జాగా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మరీ నదీ గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఆ ఇసుకను బిల్లులు సైతం లేకుండానే వందల లారీల్లో ఇతర జిల్లాలకు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలోనే ఈ ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అను‘మతి లేకుండా’..

జిల్లావ్యాప్తంగా గోదావరి నదిలో 21 ఓపెన్‌ ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో కూలీలతో ఇసుక తవ్వి, విక్రయించుకునేందుకు గతంలో ఏడాది ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు. వీటిలో కొన్నింటి గడువు గత నవంబర్‌లో ముగిసింది. మరికొన్నింటి గడువు ఈ నెలాఖరుకు ముగుస్తుంది. గత నెలలో గడువు ముగిసిన ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు తిరిగి తమకు అనుమతులు ఇవ్వాలంటూ వాటిని గతంలో దక్కించుకున్న వారు అధికారులకు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకూ అధికారులు ఏ ఒక్క రీచ్‌కు అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ, నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు – పెండ్యాల, కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం ఓపెన్‌ రీచ్‌లలో అక్రమార్కులు దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులూ ఉన్న ర్యాంపులో మాదిరిగానే రేయింబవళ్లు ఇసుక తవ్వేస్తున్నారు. కానూరు – పెండ్యాల ర్యాంపులో సాగుతున్న ఇసుక దందా రాత్రయితే జాతరను తలపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఎలాంటి బిల్లులూ లేకుండానే ఇసుక లోడింగ్‌ చేసేసి, జాతీయ రహదారుల మీదుగా అధికారుల కళ్లెదుటే దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ర్యాంపు నుంచి నిత్యం 50 నుంచి 100 లారీల్లో ఇసుకను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

నిబంధనలకు నీళ్లు

ఫ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో నీటి ప్రవాహానికి, ఏటిగట్టుకు 200 మీటర్ల పరిధిలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ, కానూరు – పెండ్యాల రీచ్‌లో దీనిని పట్టించుకోకుండా గోదావరిని ఇష్టానుసారంగా గుల్ల చేస్తున్నారు.

ఫ ర్యాంప్‌లో యంత్రాలతో ఇసుక తవ్వకూడదు. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు.

ఫ నదీ గర్భంలోకి లారీలు వెళ్లకూడదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బయటకు తీసుకొచ్చి లారీలకు నింపాలి. కానీ, లారీలను ఇష్టానుసారంగా గోదావరి నదిలోకి తీసుకెళ్తున్నారు.

ఫ రీచ్‌ నుంచి ట్రాక్టర్లతో ఇసుక తెచ్చేందుకు మట్టితో మాత్రమే రహదారి వేయాలి. కానీ, ఇసుక మాఫియా బరితెగించి లారీలు తీరిగేందుకు వీలుగా గ్రావెల్‌ రోడ్లు వేసింది.

ఫ నిబంధనల ప్రకారం ఇసుక మేట 3 ఘనపు మీటర్లు ఉంటే.. ఒక ఘనపు మీటర్‌ మాత్రమే కూలీలతో తీయించాలి. కానీ, యంత్రాలతో నదీగర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఎంత వీలుంటే అంత కుళ్లబొడిచేస్తున్నారు. దీంతో, నదీగర్భంలో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి.

ఫ కుమారదేవం ఓపెన్‌ రీచ్‌ నుంచి సైతం నిత్యం వందల లారీల్లో ఇసుక అక్రమంగా తవ్వి, తరలించుకుపోతున్నారు.

నిఘా శూన్యం

రీచ్‌ల వద్ద ఎటువంటి నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాలతో పాటు, అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారుతోంది. ఒకవేళ ఉన్నా.. మామూళ్ల మత్తులో పడి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత కలెక్టర్‌ హయాంలో ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎప్పుడు వచ్చి అధికారులు పట్టుకుంటారోననే భయం ఉండేది. ప్రస్తుత కలెక్టర్‌ కూడా ఇసుక అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ మంత్రిగారి ఇలాకాలో

చెలరేగుతున్న ఇసుక మాఫియా

ఫ కానూరు – పెండ్యాల రీచ్‌లో

బరితెగింపు

ఫ ప్రతి రోజూ వందల లారీల్లో

ఇతర జిల్లాలకు తరలింపు

ఫ కూటమి నేతల

అండదండలతో దందా

ఫ కుమారదేవంలోనూ అదే తంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement