మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి.. | - | Sakshi
Sakshi News home page

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..

Dec 17 2025 6:53 AM | Updated on Dec 17 2025 6:53 AM

మంచు

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కళ్లెదుటే తల్లిని, కొద్దిసేపటికి అన్నను కోల్పోయిన వైనం

గండేపల్లి: అన్నను ఆస్పత్రిలో చేర్చేందుకు తల్లిని, బాబాయిని, మరో వ్యక్తిని వాహనంలో వెంట తీసుకువెళుతుండగా కమ్ముకొచ్చిన మంచు, తరుముకొచ్చిన కునుకు మృత్యు ఒడికి తీసుకుపోయాయి. కళ్లముందే కన్నతల్లిని, కొద్దిసేపటికే అన్నను కోల్పోయిన వ్యక్తి హృదయ విదారక ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన తొర్లపాటి శశికుమార్‌ (27) క్యాన్సర్‌తో బాధపడుతుండగా ఇతనికి మెరుగైన వైద్యం కోసం తమ్ముడు తొర్లపాటి సంజయ్‌, తల్లి తులసి (49), బాబాయి తొర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కలిసి కారులో విశాఖ ఆస్పత్రికి వెళుతున్నారు. మండలంలోని గండేపల్లి శివారు బంక్‌ సమీపంలోకి వచ్చేసరికి మంగళవారం తెల్లవారుజాము సుమారు 3.40 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసికి ముఖం, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న శశికుమార్‌, నాగబత్తుల శ్రీనుకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ వాహన సిబ్బంది, నైట్‌ డ్యూటీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్‌ మృతి చెందాడు. తులసి మృతదేహాన్ని జెడ్‌ రాగంపేట సీహెచ్‌సీకి తరలించి, ప్రమాదానికి గురైన కారును క్రేన్‌ సహాయంతో పక్కకు తీయించారు. కారు నడుపుతున్న తొర్లపాటి సంజయ్‌ స్వల్పగాయాలతో బయటపడగా ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సై యూవీ శివ నాగబాబు పరిశీలించి ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. రాజమహేంద్రవరంలో టీ తాగి ప్రయాణం ప్రారంభించగా వీరు ప్రయాణిస్తున్న కారు గండేపల్లిలో ప్రమాదానికి గురైంది. తీవ్రమైన మంచు, తెల్లవారుజాము ప్రయాణంలో డ్రైవర్‌కు కునుకుపాటుకు గురవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఆస్పత్రికి బదులు మృత్యుఒడికి..

కొత్తపేట: తొర్లపాటి వీరాస్వామి, తులసి దంపతులు తమ కుమారులు శశికుమార్‌, సంజయ్‌లతో కలసి వ్యవసాయ కూలీ పనులతో పాటు కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు శశికుమార్‌కు అనారోగ్యం పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్‌గా నిర్ధారించారు. విశాఖపట్నంలో క్యాన్సర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. చిన్న కుమారుడు సంజయ్‌కు కారు డ్రైవింగ్‌ రావడంతో రోజువారీ అద్దెకు కారు తీసుకుని మంగళవారం రాత్రి వెలిచేరులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున ఈ ఘోరం జరిగిపోయింది.

వెలిచేరులో విషాద ఛాయలు

వెలిచేరు గ్రామ శివారు కాలనీకి చెందిన తొర్లపాటి తులసి, ఆమె కుమారుడు శశికుమార్‌ మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు కాలనీలో అందరితో కలసిమెలసి ఉంటారని, సహచర వ్యవసాయ కూలీలతో కలిసి పనులు చేసుకునేవారని స్థానికులు చెప్పారు. కొన్ని రోజులుగా శశికుమార్‌ అనారోగ్యానికి గురికాగా వారి కష్టార్జితంతోనే వైద్యం చేయిస్తూ వచ్చారని తెలిపారు. తల్లీ, కొడుకు చనిపోయారంటే జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి.. 1
1/3

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి.. 2
2/3

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి.. 3
3/3

మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement