ట్రాక్టర్ బోల్తా...డ్రైవర్ మృతి
ముమ్మిడివరం: తవుడు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ దాని కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన వరసాల సత్యనారాయణ(50) మంగళవారం ట్రాక్టర్‌పై తవుడు లోడుతో కూనవరం వెళుతుండగా ముమ్మిడివరం శివారు బొండాయి కోడు తూము వద్ద 216 జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న బడుగు రాణిని ఢీకొన్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద పడి ఊబిలో కూరుకుపోయాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను తీయగా డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. స్కూటీపై వెళుతున్న బడుగు రాణికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్‌ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి గాయపడిన బడుగురాణికి సపర్యలు చేసి, ఆమెను 108లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సాహితీ సూర్యుడు బోయి భీమన్న
అమలాపురం టౌన్: ఆధునిక సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహా కవి పద్మశ్రీ బోయి భీమన్న సాహితీ సూర్యుడని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. బోయి భీమన్న వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో మంగళవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. తొలుత బోయి భీమన్న చిత్రపటానికి డాక్టర్ ప్రతాప్‌తోపాటు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాకవి బోయి భీమన్న –వ్యక్తిత్వం–రచనలు అనే అంశంపై డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కవయిత్రి సబ్బెళ్ల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొని బోయి భీమన్న సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.


