ఒకే రోజు ఇద్దరికి అరుదైన గుండె శస్త్ర చికిత్సలు
కాకినాడ రూరల్: తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండె సంబంధిత లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు కార్డియాలజిస్ట్ ఓబుల్‌రెడ్డి తెలియజేశారు. సర్పవరం జంక్షన్‌లోని రమణయ్యపేట సంత మార్కెట్ వద్ద గల మిత్ర హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కాకినాడ ఆర్‌ఆర్‌నగర్‌కు చెందిన 65 ఏళ్ల ద్వారంపూడి వెంకయ్యమ్మ, బలభద్రపురానికి చెందిన 54 ఏళ్ల కర్రి శ్రీనివాసరెడ్డి తమ ఆస్పత్రికి రాగా ఇద్దరిలోనూ గుండె ధమనుల అవరోధం గుర్తించామన్నారు. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమ వైద్య నిపుణుల బృందంతో ఆప్టికల్ కోహిరెన్స్ ట్రోమోగ్రఫీ ఆధారిత కార్డియాక్ ఇంటర్వెన్షన్(ఓసీటీ గైడెడ్ పీసీఐ) అనే అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ అత్యాధునిక ఓసీటీ పరికర సదుపాయం తమ మిత్ర హార్ట్ కేర్ సెంటర్‌లో ఉందన్నారు. ఏఐ క్యాథ్ ల్యాబ్, ఏఐ ఆధారిత వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నట్టు ఓబుల్‌రెడ్డి తెలిపారు.


